ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నిరంతరాయంగా కొనాగిస్తోంది. ఇప్పటికీ యుద్దం తేలలేదు. రష్యా గెలవలేదు. ఉక్రెయిన్ తలవంచలేదు. బాంబులు పేలుతూనే ఉన్నాయి. ఈ కారణంగా ఉక్రెయిన్ ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇప్పటికి ఉక్రెయిన్ నుంచి 60 లక్షల మంది ఇతర దేశాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఉక్రెయిన్‌ మొత్తం జనాభా 3 కోట్ల 70 లక్షలు. ఇందులో 60 లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోతే ఇప్పుడా దేశంలో మిగిలింది మూడు కోట్లకు కాస్త అటూ ఇటూగానే. 



ఉక్రెయిన్‌ను వదిలి పెట్టి వెళ్లిన వారిలో  అత్యధికులు మహిళలు, పిల్లలే . రష్యా బాంబుల ధాటికి వారు ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో వారి రాకను ఇతర దేశాలు కూడా అడ్డుకోలేదు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ నెల 11 వరకు 60,29,705 మంది దేశ సరిహద్దులు దాటివెళ్లారని పేర్కొన్నది. అందులో 90 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని వెల్లడించింది. అత్యధికులు పోలండ్‌లో ఆశ్రయం పొందుతున్నారు.



 18-90 ఏండ్ల వయస్కులైన పురుషులు యుద్ధంలో పాల్గొనాలన్న కారణంగా ఎవరూ ఉక్రెయిన్‌ను విడిచి పెట్టి వెళ్లలేదు. స్వదేశాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు. అయితే ఇతర దేశాలకు వెళ్లకపోయినా ...   80 లక్షల మంది దేశంలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. సురక్షిత ప్రాంతాలను వెదుక్కుని షెల్టర్ కోసం రీ లొకేట్ అయ్యారు. ఇప్పటికీ వలసలు  ఉన్నాయి అయితే  సరిహద్దులు దాటుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. 



మార్చి నెలలో యుద్ధ భూమి నుంచి 30 లక్షల 40 వేల మంది దేశం విడిచి వెళ్లారు. ఏప్రిల్‌ నాటికి ఆ సంఖ్య పది లక్షల 50 వేలకు తగ్గింది.  మే నెల ప్రారంభం నుంచి 4 లక్షల 93 వేల మంది ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటారని, మొత్తంగా ఈ ఏడాది 80 లక్షల మంది పొరుగు దేశాలకు వలస వెళ్లే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తున్నది.