Azadi Ka Amrit Mahotsav: 


చివరి శ్వాస వరకూ అదే వస్త్రధారణతో..


దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా..ఈ సారి వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఆంగ్లేయుల పాలన నుంచి భారత దేశానికి విముక్తి కలిగించే క్రమంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా పోరాటం చేశారు. గడప దాటి ఆయుధం పట్టి పోరాడిన వాళ్లు కొందరైతే, అహింసాయుత మార్గంలో బ్రిటీష్‌ వారిపై దండెత్తిన వాళ్లు మరికొందరు. ఈ రెండో దళానికి నాయకుడిగా ముందుండి నడిపించారు మహాత్మా గాంధీ. ఆంగ్లేయుల అవమానాన్ని భరించి, స్వదేశానికి తిరిగి వచ్చి అహింసా ఉద్యమాన్ని మొదలు పెట్టారు బాపూజీ. ఈ ఉద్యమం ప్రారంభించిన నాటి నుంచి ఆఖరి శ్వాస విడిచే వరకూ ఆయన ఒకే వేష ధారణతో ఉన్నారు. కొల్లాయి కట్టుకునే పాదయాత్ర చేశారు. చేతిలో కర్రనే ఊతంగా చేసుకుని ఎన్నో మైళ్లు నడిచారు. లక్షలాది మందిలో
స్వాతంత్య్ర స్ఫూర్తి రగిలించారు. ఆయన కొల్లాయి మాత్రమే కట్టుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు..? అమరులయ్యే వరకూ ఇదే సిద్ధాంతాన్ని ఎందుకు అనుసరించారు..? 


కొల్లాయి కట్టడానికి కారణమిదే..


దాదాపు 100 సంవత్సరాల క్రితం 1921 సెప్టెంబర్ 22వ తేదీన మహాత్మా గాంధీ ఓ నిర్ణయం తీసుకున్నారు. "ఇక నుంచి నేను కొల్లాయి మాత్రమే కట్టుకుంటాను" అని గట్టిగా నిశ్చయించుకున్నారు. గుజరాతీ శైలిలో ఓ ధోతి, శాలువాను మాత్రమే ధరించాలని భావించారు. మదురైలో ఈ నిర్ణయం తీసుకున్న గాంధీజీ అప్పటి నుంచి అదే అనుసరించారు. పేద ప్రజల కోసం, వారి స్వేచ్ఛ కోసం కచ్చితంగా పోరాడాలి అని అనుకున్న మరుక్షణమే ఇలా తన వస్త్రధారణను మార్చుకున్నారు. అప్పట్లో ప్రజలు ఇదే వస్త్రధారణతో ఉండే వారు. సామాన్యులలో సామాన్యుడిగా కలిసిపోవాలంటే ఇదొక్కటే మార్గమని భావించారు. విదేశాలకు వెళ్లినా సరే అదే వస్త్రధారణతో వెళ్లేవాడు. ఇలా తిరిగినందుకు ఎప్పుడూ సిగ్గు పడలేదు బాపూజీ. కొంత మంది హేళన చేసినా..వాటిని పట్టించుకోలేదు. 


"నాకు ఎదురైన అనుభవాల వల్లే, నాకు నేనుగా నా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకున్నాను. ఎంతో ఆలోచించాక మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకున్నాను. ఈ విషయంలో నేను ఎప్పటికీ బాధ పడను. వస్త్రధారణ విషయంలోనూ ఇంతే కఠినంగా నిర్ణయం తీసుకున్నాను" -మహాత్మా గాంధీ. 


ఆ ఘటనే మార్పు తీసుకొచ్చింది..


నిజానికి ఇదేమీ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో సంఘటనలు, సందర్భాలు చూసిన తరవాత ఆయన తన వస్త్రధారణను మార్చుకోవాలని అనుకున్నారు. చివరకు తమిళనాడులోని మదురై అందుకు వేదికగా మారింది. అందుకే ఎన్నో సందర్భాల్లో గాంధీజీ...మదురై గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే వారు. "అంతకు ముందు నేను నా వస్త్రధారణను మార్చుకునేందుకు ఎంతో ప్రయత్నించినా ఎందుకో కుదరలేదు. మదురైకి రాగానే ఆ సంకల్పం నెరవేరింది" అని చెబుతుండేవారు. ఇలా మార్చుకోవటానికి ప్రేరేపించిన సంఘటనలనూ వివరించారు. 


"మద్రాస్ నుంచి మదురైకి రైళ్లో వెళ్తున్నాను. బోగీ అంతా కిక్కిరిసిపోయింది. చాలా సేపటి తరవాత నేనో విషయం గ్రహించాను. అందరూ విదేశీ దుస్తులే ధరించారు. అది చూసి గుండె చివుక్కుమంది. వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లి "ఖాదీ దుస్తులు ధరించండి" అని బతిమాలాను. వారు దానికి ఖాదీని కొనుగోలు చేసేంత డబ్బు మా దగ్గర లేదు. మేము బీదవాళ్లం అని సమాధానమిచ్చారు. అప్పుడు కానీ అర్థం కాలేదు. ప్రజలు ఎందుకు ఖాదీ ధరించటం లేదో. అప్పుడు నేను చొక్కా, టోపీ, ధోతీతో ఉన్నాను. వాళ్ల మాటల్లో నిజం లేకపోలేదు. కానీ...అప్పటికే లక్షలాది మంది ప్రజలు ఖాదీనే వినియోగించాలనే ఉద్దేశంతో అర్ధనగ్నంగానే జీవనం సాగిస్తున్నారు. నాలుగు అంగుళాల వెడల్పున్న కొల్లాయి కట్టుకుంటున్నారు. నేను నిండుగా దుస్తులు ధరించి... దేశ ప్రజలందరూ విదేశీ దుస్తులను విడిచిపెట్టి, ఖాదీ ధరించాలని నేనేలాచెప్పగలను..? తరవాత మదురైకి వెళ్లాను. అక్కడ సమావేశం జరిగిన మరుసటి రోజు ఉదయమే నా వస్త్రధారణ మార్చుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాను" అని చెప్పారు గాంధీజీ. అయితే తన అనుచరులు, తన సన్నిహితులు అందరూ ఇదే వస్త్రధారణలో ఉండాలన్న నియమం ఆయన ఎప్పుడూ పెట్టలేదు. విదేశీ దుస్తుల్ని బహిష్కరించి, ఖాదీ ధరించాలని మాత్రమే పిలుపునిచ్చారు.


మార్చుకునేదే లేదు..


మహాత్మా గాంధీ తన వస్త్రధారణ మార్చుకోవటంపై రకరకాల విమర్శలు వచ్చాయి. ఓసారి బంకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ జార్జ్‌తో సమావేశానికి హాజరయ్యారు గాంధీజీ. ఆ మీటింగ్‌కి కూడా కొల్లాయితోనే వెళ్లారు. ఇలా రాకూడదని అక్కడి బ్రిటీష్ అధికారులు ఆయనను నిరాకరించారు. గాంధీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దుస్తులు మార్చుకునేది లేదు అని తేల్చి చెప్పారు. బ్రిటీష్ వారి వల్లే భారతీయులు ఇలా అర్ధనగ్నంగా జీవించాల్సి వస్తుందన్న తన ఆవేదనను చాలా బలంగా చెప్పారు. "కింగ్ జార్జ్‌ను కలిసినప్పుడైనా నిండుగా దుస్తులు ధరించి వెళ్లాల్సింది కదా" అని కొందరు అధికారులు ప్రశ్నిస్తే "మా ఇద్దరికీ సరిపడా దుస్తులను, మీ రాజు ఒక్కడే వేసుకున్నాడులే" అని సమాధానమిచ్చారట గాంధీ. 


Also Read: దసరా మూవీ షూటింగ్‌లో నానికి తప్పిన ప్రమాదం, చిత్రీకరణకు కాసేపు విరామం


Also Read: Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు