జీ 20 సదస్సులో పాల్గొనేందుకు దిల్లీకి వచ్చిన అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఛైర్మన్‌ క్రిస్టాలినా జార్జివాకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. జానపద నృత్యకారులు సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం పలికారు. కళాకారుల బృందం క్రిస్టాలినా వచ్చిన సమయంలో సంబల్‌పురి పాటపై సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఆమెను స్వాగతించారు. వారి ప్రదర్శన పట్ల క్రిస్టాలినా ఎంతో సంతోషించారు. డ్యాన్స్‌ చూస్తూ నవ్వుతూ కనిపించారు. అంతేకాకుండా వారు చేసిన కొన్ని స్టెప్స్‌ అనుకరించేందుకు ప్రయత్నించారు. అలా కొద్ది క్షణాలు డ్యాన్స్‌ చేసి నృత్యకారులకు తన ప్రశంసలు తెలిపారు. అక్కడి నుంచి వెళ్తూ వారికి నమస్కారం చేశారు. 


క్రిస్టాలినా జార్జివా విమానాశ్రయంలో సంతోషంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌  సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో షేర్‌ చేశారు. 'ఐఎంఎఫ్‌ చీఫ్‌ జార్జివా జీ 20 సమావేశాల కోసం భారత్‌కు వచ్చారు. విమానాశ్రయంలో సంబల్‌పురి పాటకు కాలు కదిపారు.సంబల్‌పురి బీట్స్‌కు కాలు కదపడం కాస్త కష్టమేనని, ఒడియా ప్రైడ్‌' అంటూ ట్వీట్‌ చేశారు. 


ట్వీట్‌ చేసిన కొన్ని గంటల్లోనే వీడియోకు వేల కొద్ది వ్యూస్‌, లైక్స్‌ వస్తున్నాయి. ఇది ఒడిశాకు చాలా గర్వకారణం అని, చాలా అద్భుతంగా ఉందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇది మన సంస్కృతికి, సంగీతానికి ఉన్న బలం అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. వీడియో చాలా బాగుందంటూ, భారతీయ సంస్కృతిని మెచ్చుకుంటూ పలువురు నెటిజన్లు స్పందించారు. భారతీయ సంస్కృతి, సంగీతం, డాన్స్‌లను అద్భుతంగా ప్రదర్శించారంటూ మరొకరు పేర్కొన్నారు. వీడియో ఎంత అద్భుతంగా ఉంది, ఆమె గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ తనలోని చిన్నపిల్ల మనసత్వాన్ని అలాగే ఉంచారు. ఆమె గ్రేట్‌ అని, సూపర్‌ అని పలువురు ట్వీట్లు చేశారు.


భారత్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో వివిధ దేశాల నుంచి దేశాధినేతలు, అధికారులు, ప్రతినిధులు దేశ రాజధాని దిల్లీకి చేరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, యూకే ప్రధాని రిషి సునాక్‌ సహా ఆస్ట్రేలియా, కెనడా, మారిషస్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, యూఏఈ, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన నేతలు వస్తున్నారు. దీంతో దిల్లీలో, విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. విదేశాల నుంచి వస్తున్న అతిథులకు దిల్లీలోని లగ్జరీ హోటళ్లలో ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రత్యేకమైన వంటకాలతో మంచి ఆతిథ్యం ఇవ్వనున్నారు. భారతీయ వంటకాలను ప్రత్యేకంగా వడ్డించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 9, 10 తేదీల్లో సదస్సు జరగనుంది.