Ideas of India Summit 2024: ABP నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్న Ideas of India Summit 2024 రెండో రోజుకు చేరుకుంది. మొదటి రోజు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల గురించీ చర్చించారు. తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రెండో రోజు యూకే మాజీ మంత్రి, ఎంపీ సువెల్లా బ్రేవర్‌మన్ ( Suella Braverman) మాట్లాడారు. ఈ సందర్భంగా బాల్యంలో భారత్‌లో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. భారత్‌తో అనుబంధమేంటో వివరించారు. దాదాపు 30 ఏళ్ల తరవాత ఇండియాలో అడుగు పెట్టానని చెప్పారు. అప్పటికి ఇప్పటికి భారత్ ఎంతో మారిపోయిందని అన్నారు. భారతీయులపైనా ప్రశంసలు కురిపించారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేయడం సహా G20 సదస్సుని సమర్థంగా నిర్వహించారంటూ ప్రశంసించారు. బ్రిటీష్‌ పాలనలో జరిగిన అరాచకాల గురించీ ప్రస్తావించారు. ఆ చరిత్రను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. అన్ని సవాళ్లను దాటుకుని వచ్చిన భారత్ స్వపరిపాలనలో విజయం సాధించిందని వెల్లడించారు. 


"చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేసి చంద్రయాన్ 3 మిషన్‌ని భారత్‌ విజయవంతంగా పూర్తి చేసింది. G20 సదస్సునీ సమర్థంగా నిర్వహించింది. గ్లోబల్ సౌత్‌ గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. అటు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో భారత్‌ ముందంజలో ఉంది. ఆధార్, UPI,డిజిలాకర్ లాంటివి ఇందుకు ఉదాహరణ. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ అటు ఆర్థికంగానూ ఎదుగుతోంది. IMF అంచనాలూ ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. భారత్ భవిష్యత్ చాలా సానుకూలంగా కనిపిస్తోంది"


- సువెల్లా బ్రేవర్‌మన్, యూకే ఎంపీ


యూకే రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న సువెల్లా వలసల గురించి తన అభిప్రాయాల్ని చాలా కచ్చితంగా చెప్పారు. యూకేలో అక్రమంగా అడుగు పెట్టిన వాళ్లందరినీ వెంటనే పంపేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అప్పటి నుంచే ఈ వలసలపై చర్చ మొదలైంది. యూకే అనే కాదు. పశ్చిమ దేశాలన్నీ ఈ వలసలపై దృష్టి సారించేలా చేశారు సువెల్లా బ్రేవర్‌మన్.