Akash Deep Touches Mothers Feet Before Debut: రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో అరంగేట్ర బౌలర్‌ ఆకాశ్‌దీప్‌(Akash Deep) తొలి రోజు మ్యాచ్‌లో అదరగొట్టాడు. అద్భుతమైన బంతులతో ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మంచి లైన్‌ అండ్‌ లెంత్‌తో.. షార్ట్‌ పిచ్‌ బంతులతో... బ్రిటీష్‌ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తొలుత క్రాలేను అద్భుతమైన బంతితో ఆకాశ్‌దీప్‌ బౌల్డ్‌ చేసినా అది నో బాల్‌ కావడంతో క్రాలే బతికిపోయాడు. ఆ బంతి నో బాల్‌ అయినా... మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది. అనంతరం కూడా మంచి టచ్‌లో కనిపించిన ఆకాశ్‌ పేస్‌తో ఇంగ్లాండ్‌ బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. అనంతరం ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన ఆకాశ్‌ దీప్‌... ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో వికెట్‌ తీసి బ్రిటీష్‌ జట్టను కోలుకోలేని దెబ్బ తీశాడు. పదో ఓవర్లో డకెట్‌ను అవుట్‌ చేసిన ఆకాశ్‌... ఒక బంతి విరామం తర్వాత ఒలిపోప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో బ్రిటీష్‌ జట్టు ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే క్రాలేను బౌల్డ్‌ చేసిన ఆకాశ్‌ ఇంగ్లాండ్‌ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. టెస్ట్‌ అరంగేట్రానికి ముందు ఆకాశ్‌ చేసిన పనికి అందరూ ఫిదా అయిపోయారు.

 

అమ్మ ఆశీర్వాదం తీసుకుని

రాంచీ టెస్ట్‌లో అరంగేట్రం చేయడానికి ముందు తల్లి లదుమా దేవికి ఆకాష్‌ ఫోన్ చేశాడు. తాను టెస్ట్‌ జట్టుకు ఎంపిక అయ్యానని... నువ్వు తప్పకుండా మైదానానికి రావాలని కోరాడు. మ్యాచ్‌కు హాజరైన తల్లికి పాదాభివందనం చేసి ఆకాశ్‌ మైదానంలోకి దిగాడు. కోచ్‌ ద్రవిడ్‌ చేతుల మీదుగా క్యాప్‌ను అందుకొన్న ఆకాశ్‌.. తర్వాత తల్లికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. తన కొడుకు ఎందుకూ పనికిరాడని చాలామంది అన్నారని... ఈ రోజు మమ్మల్ని గర్వపడేలా చేశాడ’ని లదుమా సంతోషం వ్యక్తం చేశారు.

 

తొలి రోజు మ్యాచ్‌ సాగిందిలా...

రాంచీ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో తొలి రోజును... ఇరు జట్లు సంతృప్తికరంగా ముగించాయి. తొలి సెషన్‌లో భారత బౌలర్ల జోరు కొనసాగగా మిగిలిన రెండు సెషన్లలో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు పుంజుకున్నారు. క్లిష్ట సమయంలో పట్టుదలతో క్రీజులో నిలబడ్డ జో రూట్‌ అద్భుత శతకంతో చెలరేగడంతో తొలి రోజు ఇంగ్లాండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. రూట్‌ 106 పరుగులతో, రాబిన్సన్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ను.. అరంగేట్ర బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ హడలెత్తించాడు. ఒకే ఓవర్లు రెండు వికెట్లు తీసిన ఆకాశ్‌... ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో వికెట్‌ తీసి బ్రిటీష్‌ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. అశ్విన్‌... రవీంద్ర జడేజా కూడా చెరో వికెట్‌ తీయడంతో తొలి సెషన్‌లో 112 పరుగులకే ఇంగ్లాండ్‌ అయిదు వికెట్లు కోల్పోయింది. కానీ లంచ్‌ తర్వాత బ్రిటీష్‌ బ్యాటర్లు ఆచితూచి బ్యాటింగ్‌ చేశారు. బెయిర్‌ స్టో 38, బెన్‌ ఫోక్స్ 47 సాయంతో రూట్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఆ తర్వాత బెయిర్‌ స్టో, ఫోక్స్‌ అవుటైనా రూట్‌ పట్టుదలగా ఆడి అజేయ శతకంతో ఇంగ్లాండ్‌ను ఆదుకున్నాడు. భారత బౌలర్లలో ఆకాశ్‌ దీప్‌ 3.. సిరాజ్‌ 2 వికెట్లు తీయగా... అశ్విన్‌, జడేడా చెరో వికెట్‌ తీశారు.