FM Nirmala Sitharaman on Hindi:
తెలుగు నేర్చుకోగలిగా: నిర్మలా సీతారామన్
హిందీ విషయంలో భాజపాతో ఏకీభవించే వాళ్లు కొందరైతే...వ్యతిరేకించే వాళ్లు ఇంకొందరు. బలవంతంగా ఈ భాషను తమపై రుద్దొద్దని తమిళ ప్రజలు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ వివేక్ మ్యాగజైన్ నిర్వహించిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమె...హిందీలో మాట్లాడారు. అంతకు ముందు ఆమె తనకు హిందీ అంటే ఎంత భయమో వివరించారు. "హిందీ మాట్లాడుతుంటే ఎందుకో నేను వణికిపోతాను. చాలా సంకోచిస్తాను" అని కామెంట్ చేశారు. "తమిళనాడులో పుట్టి పెరిగాను. అక్కడ హిందీకి వ్యతిరేకంగా కాలేజీలో ఉద్యమం కూడా చేశాను. సెకండ్ లాంగ్వేజ్‌గా హిందీ కానీ, సంస్కృతం కానీ తీసుకున్న వాళ్లకు స్కాలర్‌షిప్ వచ్చేదే కాదు. మన వయసు పెరిగే కొద్దీ...కొత్త భాష నేర్చుకోవడం కష్టమైపోతుంది. నా భర్త తెలుగు వాడు కాబట్టి...ఆ భాషను బాగానే నేర్చుకోగలిగాను. కానీ హిందీ మాట్లాడటం మాత్రం ఎందుకో సరిగా నేర్చుకోలేకపోయాను" అని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ తరవాత దాదాపు 35 నిముషాల పాటు హిందీలోనే మాట్లాడారు.
ఆ సంస్కరణలు హాఫ్ బేక్డ్..
ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎప్పుడో సత్తా చాటేదని, కానీ అంతకు ముందు ఆర్థిక విధానాల వల్ల ఇది సాధ్యం కాలేదని గుర్తు చేశారు. 1991 ఆర్థిక సంస్కరణల గురించీ ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ఆ సంస్కరణలు "హాఫ్ బేక్డ్"(Half Baked)అంటూ విమర్శలు చేశారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పద్ధతి అది కాదని అన్నారు. "భాజపా అధికారంలోకి వచ్చేంత వరకూ ఏ అభివృద్ధీ జరగలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధాని అయ్యాక బిల్డింగ్‌లు, రోడ్లు నిర్మించేందుకు చొరవ చూపించారు. ఆ తరవాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి మారింది. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలపైనే వాళ్లు దృష్టి పెట్టారు" అని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు తీసుకున్నాక...ఆర్థిక సంస్కరణలకు కొత్త దారి చూపించారని, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అక్రమాలకు తావులేకుండా చూశారని ప్రశంసించారు. ఈ పథకం వల్ల రూ.2 లక్షల కోట్ల లబ్ధి జరిగిందని వెల్లడించారు.
హిందీపై అమిత్‌షా వ్యాఖ్యలు..
అంతకు ముందు కేంద్రమంత్రి అమిత్‌షా హిందీ విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయం హిందీ భాష అని ప్రజలందరూ హిందీ నేర్చుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి చేసిన ప్రకటన మరోసారి రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది. పార్లమెంటరీ అధికార భాషా కమిటీ సమావేశంలో అమిత్ షా హిందీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం.. ఒకే భాష అన్న పద్దతిలో అమిత్ షా వ్యాఖ్యలు ఉండటంతో విమర్శలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఓ రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తితో మాట్లాడాల్సి వస్తే అది ఇంగ్లిష్ కాదని.. హిందీ అయి ఉండాలన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు తొమ్మిదో తరగతి వరకు హిందీలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలన్నారు.
Also Read: Gujarat investor: బ్యాంక్ తప్పు వల్ల రూ.11,677 కోట్ల జాక్‌పాట్ కొట్టిన ఇన్వెస్టర్