Joe Biden:


కెనడా పార్లమెంట్‌లో స్పీచ్..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తరచూ వార్తలో ఉంటారు. సంచలన నిర్ణయాలతో కాదు. స్పీచ్‌లతో. అవును. ఆయన ప్రసంగించిన ప్రతిసారీ ఏదో ఓ పొరపాటు చేస్తుంటారు. అది కాస్తా వైరల్ అవుతుంది. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. కెనడాకు బదులుగా చైనాను పొగిడి ఆ తరవాత వెంటనే తప్పు సరిదిద్దుకున్నారు. అప్పటికే చుట్టూ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా గొల్లున నవ్వారు. కెనడా పార్లమెంట్‌లో ప్రసంగించిన సమయంలో జరిగిందీ ఘటన. అక్కడి వలస చట్టాల గురించి ప్రస్తావించారు బైడెన్. ఆ చట్టాలను ప్రశంసించే సమయంలో "కెనడా" పేరు బదులు "చైనా" పేరు ప్రస్తావించారు. వెంటనే తప్పు తెలుసుకుని సారీ చెప్పారు. "క్షమించాలి. నేను చెప్పేది కెనడా గురించి. చైనా గురించి కాదు. చైనా విషయంలో నేనేం ఆలోచిస్తూ ఉంటానో మీకు తెలిసే ఉంటుంది." అంటూ తన వ్యాఖ్యల్ని సరి చేసుకున్నారు. కెనడా పార్లమెంట్ సభ్యులు ఇది విని గట్టిగా నవ్వారు. ఆ తరవాత బైడెన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. లాటిన్ అమెరికన్ దేశాల నుంచి వచ్చే 15వేల మంది వలసదారులను తమ దేశంలోకి అనుమతిస్తూ కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు బైడెన్. అక్రమ వలసలను ఇది నియంత్రిస్తుందని అన్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతోంది. బైడెన్‌ను చైనా వెంటాడుతోందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.