SBI Amrit Kalash scheme: వడ్డీ రేట్లు పెరగడంతో పాటు, స్టాక్ మార్కెట్ లావాదేవీల మీద కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచడంతో ఇన్వెస్టర్ల చూపు ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్ల మీదకు మళ్లుతోంది. స్టాక్ మార్కెట్‌లాగా టెన్షన్ పెట్టకుండా, ఒక నిర్దిష్ట ఆదాయాన్ని కచ్చితంగా అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposit) మీద ప్రజలకు ప్రేమ పెరుగుతోంది. దీంతో, పెట్టుబడి మార్గాల్లో దీని ఆదరణ కూడా పెరుగుతోంది. స్థిరమైన ఆదాయంతో పాటు సురక్షితమైన పెట్టుబడి మార్గం కావడంతో, ఎక్కువ మంది తమ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లలోకి మళ్లిస్తున్నారు.
మారిన ట్రెండ్‌కు అనుగుణంగా మీరు కూడా ఒక మంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే, దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India - SBI) ఆఫర్ చేస్తున్న పథకాన్ని పరిశీలించవచ్చు. అది 400 రోజుల పరిమిత కాల పథకం. పేరు ‘అమృత్ కలశ్’ (SBI Amrit Kalash scheme).
అమృత్ కలశ్ పథకంలో ఎంత వడ్డీ చెల్లిస్తారు?
స్టేట్ బ్యాంక్ తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ఇది. పైగా, పరిమిత కాల ఆఫర్. ఈ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు (60 సంవత్సరాలు లేదా ఆ వయస్సు దాటిన వాళ్లు) ఏటా 7.6 శాతం వడ్డీని స్టేట్ బ్యాంక్ చెల్లిస్తుంది. సాధారణ పౌరులకు (60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వాళ్లు) ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును బ్యాంక్ జమ చేస్తుంది.
వడ్డీ రేటుపై ఒక ఉదాహరణను పరిశీలిస్తే... ఎస్‌బీఐ అమృత్ కలశ్‌లో ఒక సీనియర్ సిటిజన్ ఒక 5 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే, 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం 400 రోజులకు రూ. 43,000 వడ్డీ వస్తుంది. అదే రూ. 5 లక్షల డిపాజిట్‌కు, 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం, 400 రోజులకు ఒక సాధారణ పౌరుడికి లభించే వడ్డీ మొత్తం 40,085 రూపాయలు.
ఈ స్పెషల్ ఆఫర్‌లోనే మరొక ఆఫర్ కూడా స్టేట్ బ్యాంక్ ఇచ్చింది. ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే SBI ఉద్యోగులు, పింఛనుదార్లకు మరొక శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది.
ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది?
2023 ఫిబ్రవరి 15న ప్రారంభమైన ఈ స్కీమ్ 2023 మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుంది. అంటే, కేవలం కొన్ని రోజుల్లోననే ఈ పథకం ఆగిపోతుంది. ఆలోగా డిపాజిట్ చేసినవారికి మాత్రమే ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న ప్రత్యేక వడ్డీ రేటు లభిస్తుంది.
అమృత్ కలశ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మీకు దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు మీరు స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి వరకు వెళ్లేంత సమయం మీకు లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్ ద్వారా కూడా ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.
ఈ స్కీమ్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే సదుపాయం కూడా ఉంది. దీంతో పాటు, ఈ డిపాజిట్‌ను మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది.
అమృత్ కలశ్ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై TDS (Tax Deducted at Source) కట్ అవుతుంది. కట్ అయిన మొత్తాన్ని, ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.