PAN Aadhaar Linking: ఏప్రిల్ 1, 2023 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (Financial Year 2023-24) ప్రారంభం అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే, అంటే మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక సంబంధ పనులు కూడా ఉన్నాయి. ఈ నెలాఖరులోగా ఆయా పనులను పూర్తి చేయకపోతే నష్టాన్ని భరించాల్సి వస్తుంది.
ఆర్థిక సంబంధ పనులను పూర్తి చేయాలని ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department), పన్ను చెల్లింపుదార్లకు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆ పనుల్లో ఆధార్ నంబర్ - పాన్ అనుసంధానం (PAN Aadhaar Link) ఒకటి. మీరు ఇంకా మీ పాన్ - ఆధార్ లింక్ చేయకుంటే, ఈ రోజే ఈ పనిని పూర్తి చేయండి.
మరోమారు ట్వీట్ చేసిన ఆదాయ పన్ను విభాగం
మార్చి 31, 2023లోపు పాన్ & ఆధార్‌ని లింక్ చేయడంలో విఫలమైతే, ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ నిష్క్రియంగా (inoperative) మారుతుంది. ఇలాంటి పరిస్థితి వస్తే, పాన్ ద్వారా సమకూరే కొన్ని ప్రయోజనాలను మీరు కోల్పోతారు.
"మీ పాన్ - ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడింది. ఐటీ చట్టం 1961 ప్రకారం, మినహాయింపు లేని పాన్ హోల్డర్లందరూ 31.03.2023 లోపు పాన్ - ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి. అలా చేయని పక్షంలో, 1.04.2023న మీ పాన్ నిష్క్రియంగా మారుతుంది. దయచేసి ఈ రోజే లింక్ చేయండి" అంటూ ఆదాయపు పన్ను విభాగం ట్వీట్ చేసింది.
2023 మార్చి 31వ తేదీ లోపు పాన్-ఆధార్ లింక్ చేయాలంటే కేవలం రూ. 1,000 జరిమానా చెల్లిస్తే సరిపోతుంది. మార్చి 31 గడువు దాటిన తర్వాత, అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పని చేయాలంటే రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
పాన్ & ఆధార్ లింక్ చేయడం ఎలా?
పాన్ - ఆధార్‌ను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ ని సందర్శించండి.
Home బటన్ కింద Quick Links విభాగం మీకు కనిపిస్తుంది,
ఆ విభాగంలో ఉన్న Link Aadhaar మీద క్లిక్ చేయండి
కొత్త విండో ఓపెన్ అవుతుంది, ఆ విండోలో మీ పాన్, ఆధార్ వివరాలు నమోదు చేయండి.
ఆ తర్వాత, కింద కనిపించే Validate బటన్ మీద క్లిక్ చేయండి
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని నమోదు చేసి సమర్పించండి.
జరిమానా చెల్లించిన తర్వాత, మీ పాన్ ఆధార్ నంబర్‌తో లింక్ అవుతుంది