YouTuber throwing money into traffic : డబ్బులు వెదజల్లి వాటి కోసం ఎగబడే వారిని వీడియో తీసి.. అదో గొప్ప పనిగా యూట్యూబ్‌లో ప్రమోట్ చేసుకుంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఓ ట్యూబర్. హైదరాబాద్‌లోని కూకట్ పల్లి ఏరియాలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. హఠాత్తుగా ఓ యువకుడు తన మిత్రుడితో కలిసి రోడ్ మీదకు వచ్చాడు. మొదట కొన్ని నోట్లు పైకి ఎగరవేశాడు. అక్కడ జనం విరగబడి ఏరుకుంటూంటే..నవ్వుకుంటూ వీడియో తీశాడు. ఇలా మొత్తం మూడు నాలుగు చోట్ల చేసి వీడియో లు తీసుకున్నాడు. అన్ని చోట్లా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 


ప్రజలు డబ్బు పిచ్చోళ్లను చెప్పడానికి వీడియోలు                    


ఈ వీడియోలను.. ప్రజలను తాను ఎలా పిచ్చోళ్లను చేశానో చూపించుకుంటూ తన యూట్యూబ్ చానల్, ఇన్ స్టాలలో ఈ వీడియోలను పెట్టుకున్నాడు. ఈ యూట్యూబర్ పేరు హర్షగా గుర్తించారు. పవర్ హర్ష, మహదేవ్, ఇట్స్ మీ పవర్ పేరుతో సోషల్ మీడియాలో ఇతను వీడియోలు చేస్తూంటాడు. అతని వీడియోలు ఇప్పుడు వైరల్ గా  మారాయి. 






ప్రాణాల్ని రిస్క్ లో పెట్టిన యూట్యూబర్‌పై ఇంకా చర్యలు చేపట్టని పోలీసులు       


సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయినా పోలీసులు ఇప్పటి వరకూ ఈ యూట్యూబర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. డబ్బుల్ని ఇలా వెదజల్లడం నేరం అయితే..ట్రాఫిక్‌లో తొక్కిసలాట జరిగేలా డబ్బుల్ని వెదజల్లడం.. పలువురు ప్రాణాలకు ముప్పు తెప్పించే పనిగా .. ఇది అత్యంత తీవ్రమైన నేరమని చెబుతున్నారు. ఈ యూట్యూబర్‌పై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పలువురు చేస్తున్నారు. 


ఇలాంటి ఆకతాయిలకు అడ్డుకట్ట వేయకపోతే మరింతగా రెచ్చిపోయే ప్రమాదం                      


సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం.. వ్యూస్ కోసం కొంత మంది ఇన్ ప్లూయన్సర్లు మొత్తానికి మంచేదో.. చెడేదో మర్చిపోతున్నారు. ఇతరుల ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టేసి తమ వ్యూస్ కోసం పరుగులు పెడుతున్నారు. ట్రాఫిక్ లో డాన్సులు చేస్తూ..స్కిట్లు చేస్తూ..రీల్స్ చేసే వారు కొందరయితే.. మరికొందరు ఇలా డబ్బుల్ని వెదజల్లి రోడ్డు మీద జనం బలహీనతతో ఆటలాడుకుని వారిని వీడియో తీసి.. వికృతం ప్రదర్శించేవారు మరికొందరు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే.. రేపు మరింత దరిద్రమైన పనులు చేస్తారన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.