ప్రపంచంలోనే 10 అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఆయన పేరును ఈ ఎయిర్‌పోర్టుకు పెట్టారు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత.. పబ్లిక్-ప్రైవేట్ ఉమ్మడి నిర్వహణలో నడుపబడుతున్న రెండో విమానాశ్రయం ఇదే. 2010-11లో భారత దేశ విమానాశ్రయాలలో ఎక్కువ రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఆరవదిగా నిలిచింది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటూ రికార్డులు సృష్టిస్తోంది.
దేశంలోనే అత్యధిక విమాన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో శంషాబాద్ నాలుగో స్థానంలో ఉంది. చెన్నై, కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయాలను వెనక్కి నెట్టి.. ముందుకు దూసుకొచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందినవారు దుబాయ్, అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య ఎంతలా పెరుగుతుందో... విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరగుతోంది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాకపోకలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. జులై నెలలో అయితే 3.68 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలందిచగా... దాదాపు 17లక్షల మంది దేశీయ ప్రయాణికులకు సేవలందించామని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏడాది మూడున్నర కోట్ల మంది శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నెలకు 20 లక్షల మంది అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
కరోనా సమయంలో రాకపోకలు బంద్ అవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కరోనా తర్వాత శంషాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు క్రమంగా పెరిగాయి. ప్రధానంగా అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. జులై, ఆగస్టు నెలల్లో ఈ విద్యార్థుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రెండు, మూడు ఏళ్లుగా విదేశీ సంస్థల కార్యకలాపాలు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం నుంచి 80కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. దీంతో.. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఎప్పుడు చూసినా రద్దీగానే కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా దేశీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జనవరి నుంచి జూన్ వరకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు సాగించిన వారి సంఖ్య సుమారు కోటిగా నమోదైంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టును మార్చి 2008 లో ప్రారంభించారు. ఈ విమానాశ్రయం పబ్లిక్, ప్రైవేట్ ఉమ్మడి యాజమాన్యంతొ నడుస్తోంది. GMR గ్రూపు, మలేసియా ఎయిర్పోర్ట్స్ వంటి ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి పబ్లిక్ సంస్థలతో సంయుక్తంగా నడుస్తోంది. ఈ విమానాశ్రయంలో GMR గ్రూపు 63శాతం, తెలంగాణ ప్రభుత్వం, ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియాలకు 13శాతం వాటాలు ఉన్నాయి.