HP Assembly Election 2022:


సెల్ఫీ దిగిన అనురాగ్ ఠాకూర్..


హిమాచల్‌ ప్రదేశ్‌లో భాజపా జోరుగా ప్రచారం చేస్తోంది. కీలక ఎంపీలు తరచూ ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ...క్యాంపెయినింగ్‌లో వేగం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రచారంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ కాన్వాయ్‌కు ఎదురొచ్చిన కొందరు మహిళలు..ఆయనతో కాసేపు ముచ్చటించారు. తరవాత కార్ దిగి వారితో సెల్ఫీ కూడా తీసుకున్నారు. మంత్రి తమతో సెల్ఫీ దిగుతారని ఊహించని మహిళలు షాక్ అయ్యారు. జ్వాలాముఖి ప్రాంతంలో ఓ ర్యాలీలో పాల్గొని వస్తుండగా ఈ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ముందుగా ఆ మహిళలు మంత్రితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. అందుకే...స్వయంగా అనురాగ్ ఠాకూర్ కార్ దిగి వాళ్ల వద్దకు వెళ్లి వాళ్ల ఫోన్‌లోనే సెల్ఫీ దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 






జోరుగా ప్రచారం..


జ్వాలాముఖి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్..భాజపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మౌతౌర్ నుంచి సిమ్లా వరకూ జాతీయ రహదారి నిర్మాణం కోసం NHAI కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందని వెల్లడించారు. రైతులకు వేలాది కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తూ...వారిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. ఉనా నుంచి దౌలత్‌పూర్ వరకూ ర్వైల్వే లైన్‌ను ఎక్స్‌టెండ్ చేసినట్టు చెప్పిన ఆయన...వందేభారత్ ట్రైన్‌ని కూడా ఉనా నుంచి ప్రారంభించినట్టు గుర్తు చేశారు. వీటితో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బల్క్ డ్రగ్ పార్క్‌లనూ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జ్వాలాముఖితోపాటు
డెహ్రా నియోజకవర్గంలోనూ ప్రచారంలో పాల్గొన్నారు అనురాగ్ ఠాకూర్. జైరామ్ ఠాకూర్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 413 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 92 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.


మొత్తం 551 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఆ తర్వాత వారిలో 46 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు. 505 మంది పోటీకి అర్హత సాధించారు, అయితే 92 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించు కోవడంతో మొత్తం అభ్యర్థుల సంఖ్య 413కి చేరుకుంది. 413 మంది అభ్యర్థుల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తలా 68 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ వారి పార్టీ అభ్యర్థులను నిలబెట్టాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 12న జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది.


Also Read: Gujarat Election 2022: గుజరాత్‌లో బీజేపీ "ఐడెంటిటీ" కార్డుని వాడేస్తుందా? ఆ రికార్డు అధిగమించటం సాధ్యమేనా?