Gujarat Election 2022:
వాడివేడి..
గుజరాత్ ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోయినా...అక్కడ అప్పుడే ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. భాజపా, కాంగ్రెస్, ఆప్ పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. భాజపాకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆప్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయితే...ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే అంశాలు కొన్ని కీలకంగా చర్చకు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం, నీటి కొరత, జాతీయవాదంతో పాటు గుజరాతీ ఐడెంటిటీ అంశాలు...ఈసారి ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. భాజపాను ఢీకొట్టేందుకు గుజరాత్ ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకోనుంది.
ద్రవ్యోల్బణం:
ఆమ్ఆద్మీ పార్టీ నమ్ముకున్న అస్త్రం ద్రవ్యోల్బణం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ భాజపాను చుట్టుముట్టాలని చూస్తున్నారు కేజ్రీవాల్. అటు కాంగ్రెస్ కూడా ఇదే అంశాన్ని నమ్ముకుంది. అయితే...ఈ ప్రచారాన్ని భాజపా కొట్టి పారేస్తోంది. పైగా.. ఉజ్వల స్కీమ్‌లో భాగంగా లబ్ధిదారు లందరికీ ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో "ద్రవ్యోల్బణం" అంశం మరుగున పడుతుందని బీజేపీ భావిస్తోంది.
నిరుద్యోగం:
సాధారణంగా...ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీల హామీల చిట్టాలో "ఉద్యోగాల కల్పన" అనేది తప్పకుండా ఉంటుంది. గుజరాత్ ఎన్నికలు కూడా అందుకు అతీతమేమీ కాదు. ఈ సారి కూడా "యువతకు ఉద్యోగాల కల్పన" అనే అంశం ఎన్నికలను ప్రభావితం చేయనుంది. అందుకే...అటు భాజపా, ఇటు ఆప్ తమ ఎన్నికల హామీల్లో "లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం" అని స్పష్టం చేశాయి. ఆప్ ఇంతటితో ఆగలేదు. గుజరాతీలకు ఉద్యోగుల్లో 80% రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టం చేసింది.
నీటి కొరత:
గుజరాత్‌లో నీటి సమస్య కొత్తేమీ కాదు. నర్మదా డ్యామ్ ప్రాజెక్ట్‌తో కొంత వరకూ ఊరట లభించినా..ఇంకా ఇక్కడి చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కనిపిస్తూనే ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందుకే...ఇది ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రంగా మారనుంది.
గుజరాతీ ఐడెంటిటీ:
భాజపా అమ్ముల పొదిలో ఉన్న అస్త్రం "గుజరాత్ ఐడెంటిటీ". అంటే స్థానికత పేరు మీద ఓట్లు అడుగుతుంది. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావటం వల్ల ఈ ఐడెంటిటీ కార్డ్‌ని తప్పకుండా వినియోగిస్తుంది. ఎవరు స్థానికులు, ఎవరు బయటి వాళ్లు అనే ఎమోషన్‌ను ప్రజల్లో తీసుకురాగలిగితే....అది కచ్చితంగా భాజపాకే ప్లస్ అవుతుంది. ఫలితంగా....ప్రతిపక్షాలు డిఫెన్స్‌లో పడిపోవాల్సి వస్తుంది. 1985లో కాంగ్రెస్ 185 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఈ రికార్డ్‌ను మళ్లీ ఎవరూ తిరగరాయలేదు. ఈ ఎన్నికల్లో తాము ఈ రికార్డ్‌ను అధిగమి స్తామని భాజపా చాలా ధీమాగా చెబుతోంది. కానీ..రెండు దశాబ్దాలుగా భాజపా అధికారంలో ఉండటం వల్ల ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండకపోదు. పార్టీలో అంతర్గత కలహాలూ కాషాయ పార్టీని కొంత దెబ్బ తీసే అవకాశాలున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ చరిష్మా కొంత వరకూ వర్కౌట్ అయినప్పటికీ..అది మాత్రమే విజయ తీరాలకు చేర్చుతుందని భావించలేం. ఏ మాత్రం స్పేస్ దొరికినా...ఆప్భా జపాకు గట్టి పోటీ ఇచ్చి ఎక్కువ సీట్లు రాబట్టే అవకాశాల్నీ కొట్టి పారేయలేం.
Also Read: Sachin Pilot On PM Modi: వేడెక్కిన రాజస్థాన్ రాజకీయం- గహ్లోత్‌పై సచిన్ పైలట్ డైరెక్ట్ అటాక్!