షారుఖ్‌ఖాన్‌కు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. షారుక్ ఖాన్ తాజాగా నటించిన సినిమా 'పఠాన్'. నేడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. అయితే షారుఖ్ ఖాన్ నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లయింది. ‘జీరో’ సినిమా తర్వాత ఇప్పటివరకూ షారుఖ్ నటించిన సినిమాలేమీ రాలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించినా అవి ఫ్యాన్స్ కు అంతగా సంతృప్తి ని ఇవ్వలేదు. షారుఖ్ ఫుల్ లెన్త్ రోల్‌లో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ నటిస్తోన్న మూడు సినిమాల్లో 'పఠాన్' ఒకటి. ఇప్పుడీ టీజర్‌తో షారుఖ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారనే చెప్పొచ్చు.
ఇక టీజర్ విషయానికొస్తే 'పఠాన్' టీజర్ తో మళ్ళీ షారుఖ్ ఖాన్ సత్తా ఏంటో చూపించడానికి సిద్దమవుతున్నట్టు ఉంది. టీజర్ ఒక బ్యాగ్రౌండ్ వాయిస్ తో ప్రారంభం అవుతుంది. 'ఏం తెలుసు నీకు పఠాన్ గురించి' అని వాయిస్ వినిపిస్తుంది. దానికి సమాధానంగా 'మూడేళ్ళుగా అతని గురించి ఏ సమాచారం లేదు' అని లేడి వాయిస్ వస్తుంది. ‘అతని లాస్ట్ మిషన్ లో అతను పట్టుబడ్డాడు, వాళ్ళ చేతుల్లో చనిపోయాడా లేదా’ అనే డైలాగ్ పూర్తవగానే 'బ్రతికే ఉన్నాడు' అని నవ్వుతూ డైలాగ్ చెప్తూ షారుఖ్ ఎంట్రీని చూపించారు. ఇక తర్వాత టీజర్ మొత్తం ఫుల్ యాక్షన్ సీన్స్ తో అదిరిపోయిందనే చెప్పాలి. చివరిలో షారుఖ్ 'మీ కుర్చీకి బెల్ట్ బిగించుకోండి, వాతావరణం మారుతోంది' అంటూ చెప్పే డైలాగ్ తో టీజర్ ఎండ్ అవుతుంది.
టీజర్ నిమిషం పైనే ఉండటంతో విజువల్స్ బాగా చూపించారు. పఠాన్(షారుఖ్) క్యారెక్టర్ కు తగ్గట్టు గానే విలన్ పాత్రలో జాన్ అబ్రహం కనిపిస్తున్నారు. సినిమాలో ఇద్దరికీ విపరీతమైన పోటీ ఉంటుంది అని టీజర్ లో చెప్పకనే చెప్పారు మేకర్స్. టీజర్ లో వి.ఎఫ్.ఎక్స్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అదిరిపోవడంతో ఈ సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది. సినిమాలో మరోసారి దీపికా పదుకునే షారుఖ్ కు జంటగా నటించింది. 'ఓం శాంతి ఓం', 'హ్యాపీ న్యూ ఇయర్', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' వంటి పలు చిత్రాల్లో షారుక్‌తో కలిసి నటించిన దీపికా 'పఠాన్' లో మరోసారి జంటగా కనిపించింది.
ఓవరాల్ గా టీజర్ షారుఖ్ ఫ్యాన్స్ కు షారుఖ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. నిజానికి షారుఖ్ ఖాన్ పై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక షారుఖ్ పని అయిపోందని, సినిమాలకు షారుఖ్ దూరం అయ్యారు అని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే వాటన్నింటికీ షారుఖ్ 'పఠాన్' టీజర్ తో సమాధానం చెప్పాడని అనుకోవచ్చు. అందుకే టీజర్ లో డైలాగ్స్ కూడా షారుఖ్ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉన్నాయని అంటున్నారు నెటిజన్స్. ఏదేమైనా షారుఖ్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 లో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.