జూనియర్ ఎన్టీఆరే (NTR) ఎందుకు? ఇప్పుడీ ప్రశ్న రాజకీయ చర్చగా మారుతోంది. పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) మరణానంతరం ఆయనకు కన్నడ ప్రభుత్వం 'కర్ణాటక రత్న' ప్రకటించింది. ఆ పురస్కార ప్రదానోత్సవం కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం జరిగింది. దానికి సూపర్ స్టార్ రజనీకాంత్, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు. అయితే... ఎన్టీఆర్ ఆహ్వానం రాజకీయ పరమైన చర్చకు దారి తీస్తోంది.  


పునీత్ రాజ్ కుమార్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. 'చక్రవ్యూహ' సినిమాలో పునీత్ కోసం ఎన్టీఆర్ పాట పాడారు కూడా! ఆ విషయం తెలుసు కదా! ఇద్దరి మధ్య ఉన్నా ఆ ఫ్రెండ్షిప్ చూసే కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా పిలిచిందనేది అందరి మధ్య ఉన్నా ఏకాభిప్రాయం. అయితే, దీని వెనుక పొలిటికల్ యాంగిల్ ఉందని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.


జూనియర్ ఎన్టీఆర్ కు కర్ణాటకలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రత్యేకించి రాయచూరు, గంగావతి, సింధునూరు, బళ్లారి లాంటి ఏరియాల్లో చాలా వరకూ తెలుగు సెటిలర్లే ఉండటం ఓ రీజన్ అయితే... ఎన్టీఆర్ మూలాలు కర్ణాటకలో ఉండటం కూడా మరో విషయం. ఎన్టీఆర్ తల్లి షాలిని చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన వారు. అందుకే ఎన్టీఆర్ వచ్చు. స్పషంగా, అర్థవంతంగా మాట్లాడగలరు. నిన్న ఆయన కన్నడ స్పీచ్ వైరల్ అవుతోంది కూడా!


ఎన్టీఆర్ కన్నడ స్పీచ్ కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మె, సూపర్ స్టార్ రజనీకాంత్ సహా కన్నడిగులకు కూడా తెగ నచ్చేసింది. తారక్ ను చాలా ఆప్యాయంగా పలకరించారు తలైవా. అయితే కర్ణాటక రత్న అనే అధికారిక కార్యక్రమానికి తమిళనాడు నుంచి రజనీకాంత్, తెలుగు రాష్ట్రాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే అధికారిక ఆహ్వానం రావడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. 






రజనీకాంత్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. కాబట్టి, ఆయనను పిలిచారని సరిపెట్టుకున్నా... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అనధికారికంగా కొత్త వాదన వినబడుతోంది. అది ఏంటంటే... ఈ ఇద్దరు హీరోలను బీజేపీ దగ్గర చేసుకోవాలని అనుకుంటోందట. తమిళనాడు ఎన్నికల సమయంలో రజనీ పార్టీ పెట్టినా తర్వాత పోటీ చేయను అని చెప్పటం వెనుక ఆయన అనారోగ్యం కారణం ఎంత ఉందో...  బీజేపీ పెద్దల డైరెక్షన్ కూడా అంతే ఉందని ఎప్పటి నుంచో టాక్. ఆయనను పార్టీ పెట్టాలని... తిరిగి వద్దని ఇలా రజనీ ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చెప్పే చేశారనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది.


జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే... ఇటీవల హైదరాబాద్‌లో అమిత్ షా, ఎన్టీఆర్ సమావేశం అయ్యారు. ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని కలిసిన తర్వాత నుంచి ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ ట్రై చేస్తోందా? అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. నా కట్టె కాలే వరకూ టీడీపీతోనే ఉంటానని ఎన్టీఆర్ చాలా సార్లు తెగేసి చెప్పినా... కాషాయ దళం మాత్రం తారకరాముడు కావాలని అనుకుంటున్నట్లు టాక్. అందుకే కర్ణాటకలో పునీత్ కు చాలా దగ్గర హీరోలైన యశ్, రిషభ్ శెట్టి, తమిళ్ లో సూర్య లాంటి వాళ్లను విస్మరించి మరీ తారక్, రజనీని మాత్రమే పిలిచారని ప్రచారం జరుగుతోంది. 


రాజకీయ పరంగా వినబడుతోన్న వాదనలో నిజానిజాలు ఎంత ఉన్నా తారక్ కు కర్ణాటకలో ఉన్న క్రేజ్ ను చూసిన ఆయన అభిమానులు అబ్బో మా ఎన్టీవోడు అంటూ మురిసిపోతున్నారు. స్నేహానికి ఉన్న విలువ చాటేలా ఎన్టీఆర్ కన్నడలో ఇచ్చిన స్పీచ్ ను వైరల్ చేస్తున్నారు.


Also Read : నో డూప్, నో రోప్స్ - సమంత యాక్షన్ రియల్