Munugode By-Elections 2022: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నిన్నటితో ముగిసి పోయింది. ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అయితే మోడల్ కోడ్ ను ఉల్లంఘిస్తూ.. ఎవరైనా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, సహా ఇతర సోషల్ మీడియాల్లో ఎక్కడా... ఎన్నికల ప్రచారం చేయకూడదని వివరించారు. బల్క్ మెసేజ్ లు, ఫోన్ ద్వారా ఆటోమేటెడ్ క్యాంపెయిన్ చేయడంపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. సత్వర స్పందన స్ట్రైకింగ్ ఫోర్స్, సెక్టార్ బృందాలు, పోలింగ్ స్టేషన్ల భద్రతను పర్యవేక్షించడానికి, నిర్ధారించడానికి వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


మునుగోడు నియోజకవర్గ ఓటర్లు కాకుండా అనధికారిక వ్యక్తులు అంతా మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత మునుగోడులో ఉండవద్దని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో బయటి వ్యక్తుల సంఖ్యను అరికట్టేందుకు 45 పోలీసు బృందాలు, 37 రెవెన్యూ బృందాలను నియమించినట్లు చెప్పారు. ఈ బృందాలు నేడు, రేపు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించి అనధికారిక వ్యక్తుల ప్రక్షాళనతో పాటు నగదు పంపిణీని అడ్డుకుంటామని వెల్లడించారు. అలాగే ఇతర ప్రలోభాలకు పాల్పడకుడా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎన్నికలకు అవసరం అయ్యే ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పిచినట్లు తెలిపారు.


జిల్లా ఎన్నికల అధికారితో సీఈవో సమీక్ష నిర్వహించారు. పంపిణీ కేంద్రం, పోలింగ్ కేంద్రాల వద్ద కల్పిచిన సౌకర్యాలపై అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు బందోబస్తు సహా ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మునుగోడు బై పోల్ ఏ ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించడంపై జిల్లా ఎన్నికల అధికారిని వివరాలు అడిగి తెలిసుకున్నారు. చండూరులోని డాన్ బాస్కో జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల సిబ్బది సన్నద్ధతను పర్యవేక్షించారు.


298 పోలింగ్ కేంద్రాలు..


"మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కొత్త డిజైన్ తో కూడిన ఓటర్ ఐడీ ఇచ్చాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశాం. ఫ్లైయింగ్ స్కాడ్ తో కలిసి మొత్తంగా యాభై టీంలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


3366 పోలింగ్ సిబ్బందిని , 15 బలగాల సిబ్బంది మునుగోడులో వినియోగిస్తున్నాం. ఎక్కువగా డబ్బు పట్టుబడటంతో ఇన్ కం ట్యాక్స్ అధికారులను ఆదేశించాం. 111 బెల్ట్ షాపులను సీజ్ చేశాం. 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం."- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్