Sachin Pilot On PM Modi: వేడెక్కిన రాజస్థాన్‌ రాజకీయం- గహ్లోత్‌పై సచిన్ పైలట్ డైరెక్ట్ అటాక్!

ABP Desam   |  Murali Krishna   |  02 Nov 2022 02:43 PM (IST)

Sachin Pilot On PM Modi: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌పై సచిన్ పైలట్ మరోసారి విమర్శలు చేశారు.

గహ్లోత్‌పై సచిన్ పైలట్ డైరెక్ట్ అటాక్!

Sachin Pilot On PM Modi: రాజస్థాన్‌లో రాజకీయం మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శలు చేశారు. సీఎం గహ్లోత్‌ను ప్రధాని మోదీ ప్రశంసించడాన్ని అంత తేలికగా తీసుకోకూడదని పైలట్ అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీ, సీఎం గహ్లోత్.. ఒకరిని ఒకరు ప్రశంసించుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. పార్లమెంటులో గులాం నబీ ఆజాద్‌ను కూడా ప్రధాని ఒకప్పుడు అదే విధంగా ప్రశంసించారు. ఆ తర్వాత ఏమి జరిగిందో మనం చూశాం. ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. దీన్ని అంత తేలికగా తీసుకోకూడదు.             -     సచిన్ పైలట్, రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే 

ఇదీ జరిగింది

రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్.. ప్రధాని నరేంద్ర మోదీని మంగళవారం ప్రశంసించారు. అయితే దాని వెనకాల సెటైర్‌ కూడా ఉంది. గాంధీ దేశానికి ప్రధాని అయినందుకే మోదీ ఎక్కడికి వెళ్లినా ఆయనకు గొప్ప గౌరవం లభిస్తుందని అశోక్ గహ్లోత్ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనకు గొప్ప గౌరవం దక్కుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోతుగా పాతుకుపోయిన గాంధీ దేశానికి ఆయన ప్రధానమంత్రి కనుక. ప్రపంచం ఆ సత్యాన్ని గ్రహించి గాంధీ దేశానికి ప్రధాని అయిన వ్యక్తి మనల్ని కలిసేందుకు వచ్చారని గొప్పగా భావిస్తారు.           "
-  అశోక్‌ గహ్లోత్, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి

రాజస్థాన్‌ బాన్సవారా జిల్లాలోని మంగఢ్‌ హిల్‌పై నిర్వహించిన 'మంగఢ్‌ ధామ్ కి గౌరవ్‌ గాథా' కార్యక్రమం వేదికపై గహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.  

మోదీ ఏమన్నారు?

ఈ కార్యక్రమంలో ట్రైబల్‌ కమ్యూనిటీ పోరాటం, త్యాగాలను మోదీ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత ట్రైబల్‌ కమ్యూనిటీలకు చరిత్రలో సరైన స్థానం లభించలేదన్నారు. అలాంటి దశాబ్దాల కాలం నాటి తప్పులను తాము సవరిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గహ్లోత్‌ గురించి కూడా మోదీ మాట్లాడారు.

ముఖ్యమంత్రులుగా అశోక్‌ గహ్లోత్‌తో కలిసి నేను పని చేశాను. మన ముఖ్యమంత్రుల్లో ఆయన అత్యంత సీనియర్‌. ప్రస్తుతం వేదికపై ఉన్న సీఎంలలోనూ ఆయనే సీనియర్‌.                               "
-    ప్రధాని నరేంద్ర మోదీ
 
Published at: 02 Nov 2022 02:37 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.