శాకాహారులకు శరీరానికి అవసరమైన ప్రొటీన్ ను అందించేది సోయా గింజలు. సోయాతో చేసిన వంటలేవైనా అధికంగా ప్రొటీన్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తిడనం చాలా అవసరం. సోయా బీన్స్‌తో చేసే కబాబ్ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం చాలా సులువు. 
  
కావాల్సిన పదార్థాలు
సోయా గింజలు - రెండు కప్పులు
బంగాళాదుంపలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పచ్చిబఠాణీలు - అరకప్పు
శనగపిండి -రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - ఒక స్పూను
మిరియాల పొడి - అర స్పూను
ఉల్లిపాయ - ఒకటి
గరం మసాలా - ఒక స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
నూనె - వేయించడానికి సరిపడా


తయారీ ఇలా
1. సోయా గింజలను ముందుగాన నానబెట్టుకోవాలి. ఒక గంట ముందు నానబెడితే మాగా నానుతాయి. 
2. తరవాత వాటిని ఉడకబెట్టుకోవాలి. 
3. బంగాళాదుంపలు, పచ్చిబఠాణీలను కూడా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 
4. ఉడకబెట్టిన సోయా గింజలు, బంగాళాదుంపలు, పచ్చిబఠాణీలు తీసి ఒక గిన్నెలో వేయాలి. 
5. వాటిని చేత్తోనే బాగా మెదపాలి. 
6. అందులో కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, శెనగపిండి, ఉప్పు, ఉల్లితరుగు వేసి కలపాలి. 
7. ఈ మిశ్రమాన్ని కబాబ్స్ లా ఒత్తుకుని పుల్లలకు గుచ్చాలి. 
8. గ్రిల్ పాన్‌కు కొద్దిగా నూనె రాసి ఈ పుల్లలను పెట్టి కాల్చాలి. 
9. అంతే టేస్టీ సోయా కబాబ్స్ రెడీ అయినట్టే. 


తింటే ఎంతో మేలు...
సోయా రోజూ తిన్నా మంచిదే. ముఖ్యంగా గుడ్లు, చికెన్ తినని వారికి సోయా ఎంతో మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల బలహీనంగా ఉన్న ఎముకలు గట్టిగా మారతాయి. మెనోపాజ్ వయసులో ఉన్న వారు ఎముకలు గుల్లబారతాయి. ఆ వయసులో కచ్చితంగా తినాలి. ఇది రక్తపోటును తగ్గించడంలో ముందుంటుంది. అధిక రక్తపోటు అధికంగా ఉన్నవారు వీటిని తింటే రక్తపోటును బ్యాలెన్స్ చేస్తుంది. గుండెపోటు రాకుండా అడ్డుకోవడంలో కూడా సోయాతో చేసిన వంటకాలు ఉపయోగపడతాయి.స్త్రీలు పురుషులూ ఇద్దరికీ సోయా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. సోయా ఉత్పత్తులను అధికంగా తినే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇక పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  


పైన చెప్పిన విధంగా చేయడం కష్టం అనుకుంటే... ఈ ఇన్స్ స్టా వీడియోలో చూపించిన విధంగా కూడా చేసుకోవచ్చు.