Himachal Pradesh Election Results 2022: 


హిమాచల్‌లో లీడ్‌లో కాంగ్రెస్ 


గుజరాత్‌లో భారీ విజయం దిశగా దూసుకుపోతున్న బీజేపీ...హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. 68 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో...35 స్థానాల్లో గెలిస్తే...ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు వీలవుతుంది. అయితే...కాంగ్రెస్ ఇప్పటికే 40 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. బీజేపీ 25 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌ నిలబడిన సెరాజ్ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకుంది బీజేపీ. మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే...ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాగేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. "హిమాచల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. 
వారిని బెదిరిస్తోంది. అధికారం కోసం ఆ పార్టీ ఏ పనైనా చేసేందుకు వెనకాడదు" అని మండిపడ్డారు. ఈ కుతంత్రాలను అడ్డుకునేందుకు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నట్టు చెప్పారు. రాయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన..తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. "హిమాచల్ ప్రదేశ్‌లో మా ప్రభుత్వమే ఏర్పాటవుతుందన్న నమ్మకం ఉంది. ఇవాళ అక్కడికి వెళ్తున్నాను. పరిస్థితులు పరిశీలిస్తాను" అని స్పష్టం చేశారు. అయితే...కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాయ్‌పూర్‌కు తరలిస్తారా అన్న విషయంలో మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. "మా ఎమ్మెల్యేలను మేం కాపాడుకోవాలి. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది" అని అన్నారు. ఇప్పటికే...AICC సెక్రటరీలు ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డారు. ఫిరాయింపులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఓ సురక్షిత ప్రదేశానికి వాళ్లందరనీ తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. భూపేష్ బాగేల్, రాజీవ్ శుక్లా, దీపేందర్ సింగ్ హుడా లాంటి సీనియర్ నేతలు...ఈ బాధ్యత తీసుకున్నారు. మొహాలీలోని ఓ హోటల్‌కు వీళ్లను తరలించనున్నట్టు సమాచారం. 


గుజరాత్‌లో డీలా..


గుజరాత్ ఎన్నికల్లో 2017లో బీజేపీతో  కాస్తో కూస్తో పోటీ పడి చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్. ప్రస్తుత ట్రెండ్స్‌ చూస్తుంటే...కాంగ్రెస్ ఈ సారి కేవలం 32 స్థానాలకు పరిమితమైనట్టు కనిపిస్తోంది. 1990 తరవాత కాంగ్రెస్‌ అత్యంత దారుణంగా చతికిలపడింది మళ్లీ ఇప్పుడే. 1990లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33 సీట్లు దక్కాయి. 2002లో గుజరాత్ అల్లర్ల తరవాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 51 సీట్లు సాధించుకుంది. బీజేపీ 127 సీట్ల ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్‌కు అధికారం దక్కలేదు. కానీ...మధ్యలో 2007లో జరిగిన ఎన్నికల్లో మాత్రం అంతకు ముందుకన్నా 8 సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. బీజేపీ 117 స్థానాల్లో గెలవగా...కాంగ్రెస్ 59 సీట్లు గెలుచుకుంది. 2012లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చింది. ఇదే బీజేపీకి బూస్టింగ్ ఇచ్చింది. కానీ...అలాంటి సమయంలో కూడా కాంగ్రెస్‌ 61 సీట్లు సాధించుకుంది. 2017లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్. 77 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి మాత్రం పూర్తిగా చతికిల పడిపోయింది.


Also Read: Gujarat Election Results 2022: సీఎంగా సాధించలేనిది, పీఎంగా సాధించిన నరేంద్ర మోడీ - గుజరాత్‌లో భారీ ఆధిక్యం