Gujarat Election Results 2022:


రికార్డు స్థాయి విజయం..? 


గుజరాత్ ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ని చూస్తే ఈ పాటికే అర్థమై ఉంటుంది. బీజేపీ మరోసారి విజయం సాధించనుందని. మునుపెన్నడూ లేని స్థాయిలో ఆధిక్యంలో కొనసాగుతోంది కాషాయ పార్టీ. కాంగ్రెస్‌ పూర్తిగా చతికిలపడిపోయింది. ఆప్‌ చూపించిన ప్రభావం కూడా అంతంతమాత్రమే. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే...బీజేపీకి 140కిపైగానే స్థానాల్లో విజయం సాధించేలా కనిపిస్తోంది. ఇదే నిజమైతే...బీజేపీకి ఇదే రికార్డు స్థాయి విజయం కింద లెక్క. 27 ఏళ్లుగా బీజేపీయే రాష్ట్రంలో అధికారంలో ఉండగా...ఇప్పుడు కూడా ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు
సిద్ధమవుతోంది. అయితే..ఇక్కడే ఓ ఆసక్తికర అంశం గురించి చెప్పుకోవాలి. 2002లో గుజరాత్ అల్లర్ల తరవాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పుడు నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 127 స్థానాల్లో గెలిచింది. ఆ తరవాత జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించినప్పటికీ..సీట్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. రెండు దశాబ్దాలుగా ఇదే ట్రెండ్ కొనసాగింది. కానీ..ఈ సారి ఈ ఇరవై ఏళ్ల రికార్డుని బద్దలుకొట్టి అత్యధిక స్థానాల్లో విజయం సాధించనుంది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే...గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు కూడా బీజేపీకి ఇన్ని స్థానాలు రాలేదు. ఇప్పుడీ అరుదైన రికార్డుని..ప్రధాని హోదాలో సాధించారు నరేంద్ర మోడీ. ఈ సారి కూడా మోడీ చరిష్మా బాగానే పని చేసినట్టు స్పష్టమవుతోంది. తరచూ ఆయన ర్యాలీల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. సొంత రాష్ట్రం కాబట్టి..ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టారు. ఎప్పటిలాగే "లోకల్ ఐడెంటిటీ" మంత్రం పని చేసినట్టు ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. 


ఈ వ్యూహాలతో..


ఈ సారి "హిందుత్వ" బదులుగా "మోదీత్వ" బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది బీజేపీ. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా...అక్కడ "మోదీ చరిష్మాను" వాడుకోవడం భాజపా వ్యూహం. అలాంటిది..మోదీ సొంత రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతుంటే...ఆ హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లుప్తంగా చెప్పాలంటే...ఈ సారి గుజరాత్ ఎన్నికలు "మోదీ చరిష్మా" చుట్టూనే తిరిగాయి. దాదాపు మూడు నెలలుగా
గుజరాత్‌లో తరచుగా పర్యటించారు ప్రధాని మోదీ. కొత్త ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయడం, రోడ్‌ షోలు నిర్వహించటం..ఎన్నికల వ్యూహంలో భాగమే. ఈ ఏడాది మార్చి నుంచి నెలనెలా గుజరాత్‌ పర్యటనకు వచ్చారు మోదీ. ఆయన రోడ్‌షో నిర్వహించిన ప్రతిసారీ పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. ఆయన చరిష్మాకు ఇప్పట్లో వచ్చిన ఢోకా ఏమీ లేదని ఈ సంఖ్యే చెబుతోందని భాజపా గట్టిగానే చెప్పింది. అయితే..ఆప్ రాకతో భాజపాకు గట్టి పోటీ ఎదురవుతుందని భావించినా అదేం జరగలేదు. ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. 2017లోనూ భాజపా ఇదే వ్యూహంతో ముందుకెళ్లింది. ఎన్నికల తేదీ ప్రకటించక ముందు నుంచే ప్రధాని మోదీ పదేపదే రోడ్‌షోలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉన్నారు. ఆ ఫలితంగానే...విజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే వ్యూహం అమలు చేసి విజయం సాధించింది. మోదీ చరిష్మాను ఢీకొట్టడం అంత సులువేమీ కాదన్న సంకేతాలిచ్చాయి..ఈ ఫలితాలు. 


Also Read: హిమాచల్‌లో అప్పుడే మొదలైన రిసార్ట్ రాజకీయాలు? జాగ్రత్త పడుతున్న కాంగ్రెస్!