Karthika Deepothsavam: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో.. మొదట శ్రీ యోగ నరసింహ స్వామి ఆలయం పక్కన ఉన్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్లోలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ.. ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. 


ఆ తర్వాత  గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాముల వారిమేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజ స్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాకం అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహ స్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీ వరాహ స్వామి ఆలయం, స్వామి పుష్కరిణి సుమారుగా 100 నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ‌ వేదమంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.


ప్రతీ బుధవారం నిర్వహించే సహస్ర కళషాభిషేకం రద్దు..


నిన్న శ్రీవారి సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వీఐపీ భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండ ఘంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్ర కళషాభిషేకం"ను విగ్రహ అరుగుల కారణంగా పరిరక్షణకై ఆగమ శాస్త్రం పండితుల సలహాలు,‌ సూచనల మేరకు టీటీడీ రద్దు చేసింది. కేవలం ఏడాదికి‌ ఓ మారు సర్కారు వారి సహస్ర కళషాభిషేకం టీటీడీ నిర్వహిస్తొంది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. 


శ్రీవారి ఉత్సవమూర్తులు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. 


సాయంకాలం సహస్ర దీపాలంకారసేవ కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు. సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. నిత్య సేవల్లో ‌భాగంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకార సేవను నిర్వహించి, తిరుఉత్సవం నిర్వహిస్తారు. అటు తరువాత ఉత్సవ మూర్తులు శ్రీవారి ఆలహం చేరుకోగానే, సర్వ దర్శనం భక్తులను నిలిపి వేసి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. రాత్రి కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.