చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వివాహ శుభకార్యానికి వెళుతూ ట్రాక్టర్ బోల్తా పడింది. పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు సమీపంలో జరిగిన ఈదుర్ఘటనలోఆరుగురు మృతి చెందారు. 


స్థానికుల కథనం మేరకు ఐరాల మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన 25 మందితో కూడిన ట్రాక్టరు లో పూతలపట్టు మండలం జెట్టిపల్లి గ్రామానికి వివాహానికి వెళుతుండగా మార్గమధ్యలో లక్ష్మయ్య ఊరు సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ముగ్గురు ఆడవాళ్లు, ఒక డ్రైవర్, ఇద్దరు చిన్నపిల్లలు మరణించారు. 


ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పూతలపట్టు, తవణంపల్లి, ఐరాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్, ప్రైవేటు వాహనాల ద్వారా క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలో జరిగిన ప్రమాదం పై స్పందించిన జిల్లా కలెక్టర్, ఎస్పి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.


పూతలపట్టు మండలంలోని లక్ష్మయ్య ఊరు వద్ద జరిగిన ప్రమాదంలో వివాహానికి వెళ్తున్న వారు మరణించారు. సుమారు 20 మందికి పైగా క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్, ఎస్ పి రీశాంత్ రెడ్డి పరిస్థితి సమీక్షించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సౌకర్యం అందించాలని తీవ్రంగా గాయపడ్డ వారిని వెంటనే వేరే ఆసుపత్రులకు తరలించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు 


మరణించిన వారి వివరాలు


ట్రాక్టర్ డ్రైవర్ సురేందర్ రెడ్డి ( మోటకంపల్లి,) వసంతమ్మ ( బలిజపల్లి ), ముది గోళంకు చెందిన రెడ్డెమ్మ, తేజ (తల్లి ) చిన్నపిల్లలు దినేషా, దేషిక చనిపోయారు.