నైరుతి, దాని పరిసరప్రాంతాలను ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారింది. దీనికి మాండౌస్‌గా పేరు పెట్టారు. గత 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో దాదాపు పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందీ తుపాను. బుధవారం అర్థరాత్రి విడుదలైన బులెటిన్ బట్టీ చూస్తే... నైరుతి బంగాళాఖాతం మీదుగా చెన్నైకి ఆగ్నేయంగా 640 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంపై ప్రభావం చూపనుంది. భారీ వర్షాలు గాలులు వీయనున్నాయి. రేపు(శుక్రవారం) అర్థరాత్రి తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ టైంలో గరిష్టంగా 65-75 కి.మీ.ల వేగంతో గంటకు 85 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
రేపు(శుక్రవారం) రాత్రి తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని దాటే సమయంలో గాలులు బీభత్సం సృష్టిస్తాయని పేర్కొంది.
మాండౌస్ కారణంగా మూడు రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
హెచ్చరికలు:
(i) వర్షపాతం
డిసెంబర్ 8న కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉంటుంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 09న తమిళనాడు పుదుచ్చేరి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పక్కనే ఉన్న రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 10వ తేదీన ఉత్తర తమిళనాడు, రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షపాతంతో నమోదు కానుంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయి.
(ii) గాలి హెచ్చరిక:
గంటకు 40-45 కి.మీ వేగంతో 55 కి.మీల వేగంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో డిసెంబర్ 8వ తేదీన గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ ఉదయం నుంచి 80-90 kmph వేగంతో గాలులు మొదలవుతాయి. రాత్రి 100 kmph వరకు పెరుగుతాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయి.
ప్రచండ గాలులు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఈ ఉదయం నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు ప్రారంభమవుతాయి. రేపు(శుక్రవారం) సాయంత్రం నుంచి డిసెంబర్ 10 ఉదయం వరకు 70-80 kmph నుంచి 90 kmph వరకు ఈదురుగాలులు వీస్తాయి. ఇది డిసెంబర్ 10 మధ్యాహ్నం నాటికి 50-60 కి.మీ వేగంతో 70 కి.మీ.కి, ఆపై డిసెంబర్ 10 రాత్రికి గంటకు 40-50 కి.మీ.కి 60 కి.మీకి తగ్గే అవకాశం ఉంది.
(iii) సముద్ర పరిస్థితి
10వ తేదీ ఉదయం వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నైరుతి మరియు పరిసర ప్రాంతాలలో సముద్ర పరిస్థితి చాలా ఉధృతంగా ఉండి, ఆ తర్వాత క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి సముద్ర పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. రేపు(శుక్రవారం) పరిస్థితి మరింత ఉద్ధృతంగా ఉంటుంది. అందుకే
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే వెళ్లిన వాళ్లు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. ఎలాంటి వాన హెచ్చరికలు లేవు. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 29, 16 డిగ్రీలు వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు వాతావరణంపై ప్రభావం చూపుతాయి.