గుంటూరులో చంద్రబాబు టూర్
నేటి నుంచి మూడు రోజుల పాటు గుంటూరు, బాపట్ల జిల్లాలలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే కర్నూలు, గోదావరి జిల్లాల్లో వరుస పర్యటన లు చేసిన టీడీపీ అధినేత ఇకపై గుంటూరు,బాపట్ల జిల్లాలపై తన దృష్టి సారించారు.
జర్నలిస్టుల వృత్తి పరమైన మానసిక ఒత్తిడిలపై విజయవాడ లో అవగాహన సదస్సు
జర్నలిస్టులు వృత్తి పరంగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నివారణకు జర్నలిస్టులకు అవగాహన కల్పించేలా ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సదస్సులో "జర్నలిస్టులకు మానసిక ఒత్తిడిలు-పరిష్కార మార్గాలు" అనే అంశంపై ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి జర్నలిస్టులకు సలహాలు-సూచనలందిస్తారు. ప్రెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ సదస్సులో సభాధ్యక్షుడిగా ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ముఖ్య అతిధిగా ఏపీ ప్రభుత్వ సలహాదారులు(కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్ పాల్గొంటారు.
జర్నలిస్టుల వృత్తి పరమైన మానసిక ఒత్తిడిపై నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ పాల్గొని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి తో జర్నలిస్టులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఏపీ ప్రెస్ అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ తెలిపారు.
దూసుకొస్తున్న తుపాను
ఐఎండి సూచనల ప్రకారం తుపానుగా బలపడిన ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం‘మాండూస్’ చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను నేపధ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఆరు జిల్లాల్లోని కోటిమందికిపైగా సబ్ స్ర్కైబర్లకి హెచ్చరిక సందేశాలు పంపారు అధికారులు. తుపాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రం తెలిపింది. పశ్చిమ-వాయువ్య దిశగా పయనించునున్న తుపాన్ రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని దీని ప్రభావంతో మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అలానే రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్పింది.సహాయక చర్యలకోసం 5-ఎన్డీఆర్ఎఫ్, 4-ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెడీ గా ఉన్నాయని ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదనిప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.