Hijab Ban Row: ఆగని హిజాబ్ వివాదం- హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్

ABP Desam   |  Murali Krishna  |  15 Mar 2022 06:46 PM (IST)

Hijab Ban Row: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

Hijab Ban Row: ఆగని హిజాబ్ వివాదం- హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్

ఆగని హిజాబ్ వివాదం

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై బ్యాన్‌ను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ అభ్యర్థనలను మన్నించి విద్యాసంస్థల్లో హిజాబ్ బ్యాన్ నిర్ణయాన్ని ఎత్తివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కొన్ని నెలలకు ముందు కర్ణాటకలో మొదలైన హిజాబ్​ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్​ ధరించడంపై నిషేధాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.

ఇస్లాం మతవిశ్వాసాల ప్రకారం ముస్లిం మహిళలు హిజాబ్​ ధరించడం తప్పనిసరి కాదని మేం విశ్వసిస్తున్నాం. దీనినే పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలని చెప్పడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం కాదు. అది సహేతుకమైన పరిమితి.యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్. దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాలి                                              - కర్ణాటక హైకోర్టు
 
ఇలా మొదలైంది
 
కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్‌ ధరించి తరగతి గదులకు హాజరవడం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హిందూ సంఘాలు దీనిని ఖండించాయి. ఇది మొదలైన కొద్ది రోజులకే ఉడుపి, చిక్‌మంగళూరులో వాతావరణం ఆందోళనగా మారింది. హిజాబ్స్‌ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోవడంతో ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు.

మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్‌' నినాదాలతో ర్యాలీలు చేశారు. దీంతో ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.

కోర్టుకు

ఆ తర్వాత ఈ వివాదం కర్ణాటక హైకోర్టు చేరింది. హిజాబ్ ధరించి తాము విద్యాసంస్థలకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని ముస్లిం విద్యార్థినులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.

హైకోర్టు ఫుల్ బెంచ్ ఫిబ్రవరి 10న హిజాబ్ పిటిషన్‌లపై విచారణను ప్రారంభించింది. రెండు వారాల పాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 25వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. అంతలో పాఠశాల, కళాశాల క్యాంపస్‌లలో హిజాబ్‌ను నిషేధించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఎట్టకేలకు కర్ణాటక హైకోర్టు.. హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం తప్పనిసరి మతాచారం కాదని మంగళవారం తీర్పు ఇచ్చింది.

 
Published at: 15 Mar 2022 06:17 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.