Heat Wave in India:


వేడి గాలులు..


ఎండాకాలం అలా మొదలైందో లేదో అప్పుడే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే సతమతం అవుతున్న ప్రజలకు షాక్ ఇచ్చింది IMD.ఈ వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువే నమోదవుతాయని వెల్లడించింది. మధ్య, తూర్పు, వాయువ్య భారత్‌లోని ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కనీసం 10 రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఏప్రిల్‌లో బిహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలపై ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్,హరియాణాలోని ప్రజలకూ ఈ బాధలు తప్పవని IMD స్పష్టం చేసింది. సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే "Heat Wave"గా ప్రకటిస్తారు. 1901 తరవాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపింది IMD.ఆ తరవాత అనూహ్యంగా వర్షాలు కురవడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టాయి. మార్చి నెలాఖరు నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. గతేడాది మార్చి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 121 ఏళ్ల రికార్డునీ అధిగమించాయి. గతేడాది ఏప్రిల్ కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా రికార్డుకెక్కింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు కొన్ని చోట్ల వర్షాలూ కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. 


పంటలపైనా ప్రభావం..


 హాట్ వెదర్ కారణంగా ఇప్పటికే సమస్యలు మొదలయ్యాయి. విద్యుత్ డిమాండ్‌ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. పంటలపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. గోధుమ పంటపై ప్రభావాన్ని పర్యవేక్షించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  ఈసారి హాట్‌ వెదర్‌ గత రికార్డులను అధిగమించబోతుందోని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరంలో మార్చిలో మాత్రమే అత్యంత ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఒక శతాబ్దంలోనే అత్యంత హాట్ మార్చిగా రికార్డుల్లోకి ఎక్కింది. మార్చిలో మొదలైన హీట్‌ వేవ్స్ ధాటికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పంటలు ఎండిపోవడం, విద్యుత్ కొరత ఏర్పడటంతో ముందస్తు చర్యలు చేపట్టింది. ఎగుమతులను అరికట్టింది. విద్యుత్ సంక్షోభం ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 1901 నుంచి ఫిబ్రవరిలో అత్యధికంగా ఉన్నాయి. మార్చిలో ఉష్ణోగ్రతలు ద్వీపకల్ప ప్రాంతం మినహా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు దేశంలో వివిధ పంటలపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా గోధుమ ఉత్పత్తిని దెబ్బ తీయనుంది. రెండో ఏడాది కూడా పంటకు ముప్పు పొంచి ఉంది. ఫలితంగా ఆహార కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.  గోధుమ దిగుబడిలో చైనా తర్వాత భారతదేశం రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు. తక్కువ దిగుబడి ఎగుమతి నియంత్రణకు దారి తీయవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ఫలితంగా ప్రపంచ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. 


Also Read: Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్