ఆధునిక అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం ఊపిరితిత్తులకు ప్రమాదంగా మారుతున్నాయి. శరీరంలోని ప్రధాన అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. కానీ అవి క్యాన్సర్ కు గురవుతుండడంతో జీవించడం కష్టతరంగా మారుతోంది. పొగ తాగేవారికి ఊపిరితిత్తులకు క్యాన్సర్ రావడం సహజం. కానీ పొగ తాగని వారికి కూడా రావడం ఆందోళనను పెంచుతుంది. ప్రస్తుతం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో 20 శాతం మంది ధూమపానం అలవాటు లేనివారే. మరి వారు ఎందుకు ఆ క్యాన్సర్ బారిన పడుతున్నారు? దానికి కారణం వాయు కాలుష్యం, తినే ఆహారం.  


సిగరెట్ నేరుగా కాల్చకపోయినా అది కాల్చే వారి పక్కన నిలుచుని ఆ పొగను పీల్చినా చాలు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీన్నే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, పాసివ్ స్మోకింగ్ అంటారు. కాబట్టి సిగరెట్ కాల్చే వారికి దూరంగా ఉండడం ఉత్తమం. 


పెరుగుతో ఎంతో మెరుగు
శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ శక్తివంతంగా పనిచేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి అలవాట్లే కాదు, మంచి ఆహారం కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి పెరుగుకు ఉంది. రోజూ పెరుగు తినేవారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. తాజాగా బయటపడిన ఒక అధ్యయనం ప్రకారం ఎవరైతే రోజూ పెరుగు తింటారో వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. రోజుకు 85 గ్రాములు తగ్గకుండా పెరుగు తినే మగవారికి, 113 గ్రాములకు తగ్గకుండా పెరుగు తినే ఆడవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం 19 శాతం వరకు తగ్గుతుంది.


కేవలం పెరుగు మాత్రమే కాదు, ఆహారంలో పీచుపదార్థాలు అధికంగా ఉన్న ఆహారం వల్ల కూడా క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు.  పీచు పదార్థాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం 17 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. కాబట్టి రోజూ కప్పు పెరుగు తినడంతో పాటు పీచు అధికంగా ఉండే కూరగాయలను వండుకొని తినాలి. ఈ వివరాలను దాదాపు పది అధ్యయనాలతో పోల్చి డేటాను విశ్లేషించి తయారు చేశారు. ఆ పది అధ్యయనాలను 14 లక్షల మందిపై జరిగాయి. రోజూ పెరుగు, పీచు పదార్థాలు ఉన్న ఆహారం.... రెండూ తినేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు 33% తగ్గుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి చిన్న చిన్న మార్పులతోనే క్యాన్సర్ వంటి పెను ప్రమాదాలను నివారించుకునే వీలుంది.  ఆహారంలో మార్పులు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బతికినంత కాలం అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించేందుకు ప్రయత్నించండి. 



Also read: పిల్లలతో మరీ కఠినంగా ఉంటున్నారా? అలా చేస్తే వారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం





























































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.