భాజపాలోకి హార్దిక్ పటేల్
కాంగ్రెస్ మాజీ యువ నేత, రాజకీయాల్లో ఫ్రైర్‌బ్రాండ్‌గా పేరొందిన హార్దిక్ పటేల్ భాజపా కండువా కప్పుకున్నారు. గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్ నేతృత్వంలో కాషాయ పార్టీలో చేరారు. ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్వీట్ చేశారు హార్దిక్ పటేల్. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఓ సైనికుడిగా పని చేస్తానని చెప్పారు.
కాంగ్రెస్‌పై అసంతృప్తి ఎందుకు..?
2017 గుజరాత్ ఎన్నికల నాటికే పాటీదార్ ఉద్యమ నేతగా రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు పటేల్. ఈ ఉద్యమంతో అప్పట్లో కాంగ్రెస్ బాగానే లాభ పడింది. కాంగ్రెస్‌కు పరోక్షంగా చాలానే సహకరించారు పటేల్. అప్పుడే కాంగ్రెస్ అధిష్ఠానం పటేల్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపించింది. గుజరాత్‌లో అధిక సంఖ్యలో ఉన్న పటేల్ వర్గాన్ని తమ వైపునకు తిప్పుకునేందుకు హార్దిక్ పటేల్‌ని ఓ అస్త్రంగా భావించింది. మొత్తానికి 2019లో కాంగ్రెస్‌లో చేరారు హార్దిక్ పటేల్. పార్టీలోకి వచ్చీ రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది. అప్పటి నుంచి హార్దిక్ పటేల్ అధిష్ఠానంపై అసంతృప్తిగానే ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అని పేరుకే కానీ ముఖ్యమైన సమావేశాలకూ తనకు ఆహ్వానం అందేది కాదని బహిరంగంగానే చాలా సార్లు అసహనంగా మాట్లాడారు పటేల్. ఏదైనా సమస్య గురించి మాట్లాడాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని అనుకున్నా పార్టీ అనుమతించలేదని కాస్త ఘాటుగానే విమర్శించారు. ఎప్పుడో అప్పుడు హార్దిక్ కాంగ్రెస్‌ను వీడతారని అనుకుంటున్న తరుణంలోనే ఈ ఏడాది మే 18న కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.
తిడుతూనే భాజపాలోకి..
హార్ధిక్ పటేల్ భాజపాలో చేరటంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పాటీదార్ ఉద్యమం నుంచి కాంగ్రెస్‌లో చేరేంత వరకూ భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు పటేల్. హోం మంత్రి అమిత్‌షాని జనరల్ డయ్యర్‌తో పోల్చుతూ అప్పట్లో పటేల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. భాజపా తనకు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడేమో పూర్తి భిన్న స్వరం వినిపిస్తున్నారు పటేల్. కాంగ్రెస్‌ను యాంటీ హిందూ, యాంటీ గుజరాత్ అంటూ విమర్శిస్తున్నారు. ఈ యూటర్న్ గుజరాత్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.
భాజపా వ్యూహమిదేనా..?
హార్దిక్ పటేల్ భాజపాలో చేరక ముందు పరిణామాలు గమనిస్తే..భాజపా ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అసంతృప్తి నేతలను తన వైపునకు తిప్పుకుంటోంది కాషాయ పార్టీ. దళిత నేత అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ అధిష్ఠానంతో విభేదాలతో 2019లో పార్టీని వీడారు. తరవాత భాజపాలో చేరారు ఠాకూర్. ఇప్పుడు హార్దిక్ పటేల్ కూడా చేరటం వల్ల అటు పటేల్, ఇటు దళిత వర్గాల ఓట్లు భాజపా ఖాతాలో పడిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
Also Read: UPSC 2021: 10 ఏళ్లు, 6 ప్రయత్నాలు, 11 మార్కులతో ఛాన్స్ మిస్- కానీ తగ్గేదేలే అంటూ ట్వీట్
Also Read: ED Summons Sonia Gandhi: సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాక్- ఆ కేసులో సమన్లు జారీ