అప్పుడు కాంగ్రెస్‌ను ఆపలేకపోయారు..


కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి భాజపా లక్ష్యంగా విమర్శలు చేశారు. హర్ ఘర్ తిరంగ విషయంలోనూ ఆ పార్టీపై మండిపడ్డారు. కర్ణాటక పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌ను సందర్శించారు. జాతీయ జెండాను ఇస్త్రీ చేశారు. 52 ఏళ్లుగా జాతీయ జెండాను ఎగరేయని యాంటీ నేషనల్ ఆర్గనైజేషన్ (ఆర్ఎస్‌ఎస్‌ను ఉద్దేశిస్తూ) ఇప్పుడు హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి పిలుపునిచ్చిందంటూ సెటైర్లు వేశారు. "స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ను వాళ్లు ఆపలేకపోయారు. అందుకే ఇప్పుడు వేడుకలు చేసుకోటానికి మనసు రావటం లేదు" అని వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్‌ బిల్డింగ్‌లోని యంగ్ ఇండియన్ ఆఫీస్‌ని ఈడీ మూసివేసిన 
మరుసటి రోజే రాహుల్ గాంధీ, ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యే జరిగిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ "అందరూ సోషల్ మీడియా డీపీని త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలి" అని పిలుపునిచ్చారు. ఈ విషయమై కాంగ్రెస్ విమర్శలు చేస్తూనే ఉంది. కాంగ్రెస్ తన అఫీషియల్ ట్విటర్‌ అకౌంట్ డీపీని మార్చుకుంది. అయితే జవహర్ లాల్ నెహ్రూ జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఫోటోను డీపీగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే RSSపై విమర్శలు చేసింది. అటు ఆర్ఎస్‌ఎస్ కూడా రాహుల్ వ్యాఖ్యలపై స్పందించింది. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని సూచించింది. హర్ ఘర్ తిరంగ్, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలకు తాము మద్దతునిచ్చామని తేల్చి  చెప్పింది. ఇక భాజపా కూడా హర్ ఘర్ తిరంగ ఉద్యమాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు తెలిపింది.





 


ప్రధాని మాటల్ని వాళ్లే పట్టించుకోవటం లేదు..


సీనియర్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్ సహా మరికొందరు నేతలు నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఫోటోను డీపీగా పెట్టుకున్నారు. జైరాం రమేశ్ "ఇది ఖాదీతో తయారు చేసింది" అని జెండాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఇలా అన్నారు జైరాం రమేశ్. పాలిస్టర్ జెండాలు తయారు చేసేందుకు, విక్రయించేందుకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఇలా వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆర్ఎస్‌ఎస్‌పైనా సెటైర్లు వేశారు. "మేమంతా త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకున్నాం. కానీ ప్రధాని మోదీ పిలుపు, ఆయన కుటుంబ సభ్యులకే వినపడలేదేమో. నాగ్‌పూర్‌లోని హెడ్‌క్వార్టర్స్‌లో 52 ఏళ్లుగా జాతీయ జెండా ఎగరేయని వాళ్లు, ప్రధాని మాటలు వింటారా..?" అని ట్వీట్ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా...RSS ట్విటర్ అకౌంట్ డీపీల స్క్రీన్‌షాట్స్‌ తీసి ట్వీట్ చేశారు. RSS చీఫ్ మోహన్ భగవత్ ట్విటర్ అకౌంట్‌ డీపీ కూడా ఇందులో ఉంది. 


Also Read: Kangana Ranaut Vs Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌పై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు - యాంటీ హిందూ పీకే అంటూ విమర్శలు


Also Read: In Pics: దేశంలోనే తొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రత్యేకతలు చూసేయండి - ఫోటోలు