Har Ghar Tiranga: 


త్రివర్ణ పతాకం మా గుండెల్లో ఉంది: కాంగ్రెస్ 


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్ట్ 2-15వ తేదీ వరకూ సోషల్ మీడియా డీపీలో దేశ జెండాను పెట్టుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు ఇప్పటికే ప్రధాని పిలుపు మేరకు డీపీలు మార్చుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా తన ట్విటర్ డీపీ మార్చుకుంది. కేవలం త్రివర్ణ పతాకాన్ని పెట్టుకుంటే చర్చే ఉండేది కాదు. కానీ...నెహ్రూ 
జాతీయ జెండాను ఆవిష్కరించినప్పటి ఫోటోను డీపీగా పెట్టుకుంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరూ ఇదే డీపీని పెట్టుకుంటున్నారు. "త్రివర్ణ పతాకం మా గుండెల్లో ఉంది. మా రక్తంలో నిండిపోయింది. 1929 డిసెంబర్ 31వ తేదీన భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ త్రివర్ణ పతాకం ఎవరికీ తలొంచకూడదు" అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ త్రివర్ణ పతాకం మన ఉనికి, 
భారతీయుల ఐకమత్యానికి ఇదే ప్రతీక అని అందులో వెల్లడించింది.






 ప్రధాని మాటలు వాళ్లు వింటారా..? 


సీనియర్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్ సహా మరికొందరు నేతలు నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఫోటోను డీపీగా పెట్టుకున్నారు. జైరాం రమేశ్ "ఇది ఖాదీతో తయారు చేసింది" అని జెండాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఇలా అన్నారు జైరాం రమేశ్. పాలిస్టర్ జెండాలు తయారు చేసేందుకు, విక్రయించేందుకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఇలా వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆర్ఎస్‌ఎస్‌పైనా సెటైర్లు వేశారు. "మేమంతా త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకున్నాం. కానీ ప్రధాని మోదీ పిలుపు, ఆయన కుటుంబ సభ్యులకే వినపడలేదేమో. నాగ్‌పూర్‌లోని హెడ్‌క్వార్టర్స్‌లో 52 ఏళ్లుగా జాతీయ జెండా ఎగరేయని వాళ్లు, ప్రధాని మాటలు వింటారా..?" అని ట్వీట్ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా...RSS ట్విటర్ అకౌంట్ డీపీల స్క్రీన్‌షాట్స్‌ తీసి ట్వీట్ చేశారు. RSS చీఫ్ మోహన్ భగవత్ ట్విటర్ అకౌంట్‌ డీపీ కూడా ఇందులో ఉంది.