ABP  WhatsApp

Gyanvapi Mosque Case: హిందువుల డిమాండ్‌ను తోసిపుచ్చిన కోర్టు- జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు

ABP Desam Updated at: 14 Oct 2022 03:21 PM (IST)
Edited By: Murali Krishna

Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదులోని శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలన్న అభ్యర్థనను వారణాసి కోర్టు నిరాకరించింది.

(Image Source: PTI)

NEXT PREV

Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మసీదు ప్రాంగణంలో శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని హిందూవులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. 



కార్బన్ డేటింగ్ చేయాలన్న మా డిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. మేం ఆర్డర్ కాపీ కోసం ఎదురు చూస్తున్నాం. హైకోర్టుకు వెళ్లే అవకాశం మాకు అందుబాటులో ఉంది. మా అభిప్రాయాన్ని హైకోర్టు ముందు కూడా ఉంచుతాం                               -  న్యాయవాది మదన్ మోహన్ యాదవ్


జ్ఞానవాపి మసీదు-శృంగార్ గౌరీ కేసులో సెప్టెంబర్ 29న ఇరువర్గాల వాదనలను కోర్టు ఆలకించింది. ఆ తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. వారణాసి జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష్ తాజాగా శుక్రవారం ఈ తీర్పును వెలువరించారు.


ఇదీ కేసు


జ్ఞానవాపి మసీదు ఆవరణలో కోర్టు ఆదేశాల మేరకు చేసిన వీడియో సర్వేలో అక్కడ శివలింగం బయటపడిందని హిందూ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అది శివలింగం కాదని, ఫౌంటేన్ అని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. దీంతో శివలింగానికి కార్బన్  డేటింగ్ జరిపించాలని సెప్టెబర్ 12న హిందూ వర్గాలు ఈ పిటిషన్ వేశాయి.


కార్బన్ డేటింగ్ అనేది శాస్త్రీయ ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా శివలింగం ఏకాలం నాటిదో తెలుసుకునే అవకాశం ఉంటుందని హిందూ వర్గాలు, పురావస్తు శాఖ చెబుతున్నాయి. దీనిని జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ అంజుమన్ ఇంతేజామియా వ్యతిరేకించింది. 


సానుకూలంగా


అయితే జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్​పై సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.


ఇదీ జరిగింది


జ్ఞాన్​వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్‌ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు. 


సర్వేలో


దీంతో జ్ఞాన్​వాపి మసీదు- శృంగార్‌ గౌరీ ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ప్రార్థన స్థలంలోని భూగర్భ నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది. అయితే మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ సర్వే నివేదికను అడ్వకేట్‌ కమిషనర్ కోర్టులో సమర్పించారు. అయితే అది శివలింగం కాదంటూ మసీద్‌ కమిటీ వాదిస్తోంది.  


సుప్రీం కోర్టుకు


ఈ వ్యవహారం తర్వాత సుప్రీం కోర్టుకు చేరింది. అయితే జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్‌ జుడీషియల్ సర్వీసులో ఉన్న అత్యంత సీనియర్, అనుభవమున్న న్యాయమూర్తి విచారిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది.


అలానే మసీదులో సీల్ వేసిన ప్రాంతాన్ని అలానే ఉంచాలని ఆదేశించింది. ముస్లింలు యథావిధిగా మసీదు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుపై ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీం పేర్కొంది. ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. 


Also Read: Maoist Links Case: మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా తేల్చిన కోర్టు- మరి ఉద్యోగం సంగతేంటి?

Published at: 14 Oct 2022 03:13 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.