Maoist Links Case: దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జీఎన్ సాయిబాబాకు ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో జీవిత ఖైదు అనుభవిస్తోన్న సాయిబాబాను నిర్దోషిగా కోర్టు తేల్చింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. 






నాగ్‌పుర్ జైలులో


ఈ కేసులో నాగ్‌పుర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తోన్న సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని కూడా కోర్టు నిర్దోషులుగా తేల్చింది. మరేదైనా కేసులో వీరు నిందితులుగా ఉంటే మినహా వీరందరినీ తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


ఇదీ కేసు


2014 మే నెలలో సాయిబాబా, ఓ జర్నలిస్టు, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సహా మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2017 మార్చిలో సెషన్స్‌ కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది.


అప్పటి నుంచి వీరు నాగ్‌పుర్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే జీవిత ఖైదును సవాల్‌ చేస్తూ సాయిబాబా సహా మిగతా దోషులు బాంబే హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు నాగ్‌పుర్‌ బెంచ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. వీరందరినీ నిర్దోషులుగా తేల్చుతూ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.


ఉద్యోగం సంగతి!


మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో సాయిబాబా అరెస్ట్ కావడంతో దిల్లీ యూనివర్సిటీ ఆయనను సస్పెండ్‌ చేసింది. 2021లో ఆయనను పూర్తిగా విధుల నుంచి తొలగించింది. ఇప్పుడు సాయిబాబా నిర్దోషిగా తేలడంతో ఆయన ఉద్యోగం సంగతి ఏంటనేది ప్రశార్థకంగా మారింది. మళ్లీ ఆయన్ను విధుల్లోకి తీసుకుంటారో లేదా చూడాలి.


Also Read: PAK PM Statement On India: భారత్‌తో చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని ప్రకటన!