PAK PM Statement On India: భారత్‌తో చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని ప్రకటన!

ABP Desam   |  Murali Krishna   |  14 Oct 2022 01:36 PM (IST)

PAK PM Statement On India: భారత్‌తో శాంతి చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

భారత్‌తో చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని ప్రకటన!

PAK PM Statement On India: భారత్‌తో చర్చలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న భారత్‌ సహా ఇతర దేశాలతో విభేదాను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్ ఆశిస్తుందన్నారు.

కజకిస్థాన్ రాజధాని అస్తానాలో జరిగిన CICA ఆరవ శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సహా అన్ని పొరుగు దేశాలతో పాకిస్థాన్ శాంతియుత సంబంధాలను కోరుకుంటుందన్నారు.

సరిహద్దు రెండు వైపులా పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. కనుక ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి కోసం భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం.                      - షెహబాజ్‌ షరీఫ్, పాకిస్థాన్ ప్రధాని

భారత్ రియాక్షన్

పాక్ ప్రధాని షరీఫ్ ప్రకటనపై భారత్ సానుకూలంగా స్పందించింది. పాకిస్థాన్‌తో సహా అన్ని పొరుగు దేశాలతో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని భారత్ తెలిపింది. అయితే ఇందుకోసం సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ అడ్డుకోవాలని కోరింది.

సీమాంతర ఉగ్రవాదంపై విశ్వసనీయమైన, కఠిన చర్యలను పాక్ తీసుకోవాలి. తద్వారా అనుకూల వాతావరణాన్ని ఇస్లామాబాద్ సృష్టించాలి. ఆ తరువాత సరిహద్దు సమస్యలపై ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు భారత్ ముందుకు వస్తుంది.                                             - భారత్

మాటల్లేవ్

పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్‌తో చర్చలు జరిపే సమస్యే లేదన్నారు. ఇటీవల కశ్మీర్‌ పర్యటనలో అమిత్ షా ఇలా అన్నారు.

1990 నుంచి జమ్ముకశ్మీర్‌లో 42వేల మంది ప్రాణాలను ఉగ్రవాదం అనే భూతం బలిగొంది. అలాంటిదానితో ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? అబ్దుల్లాలు, ముఫ్తీలు, నెహ్రూ కుటుంబం.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకుంటూనే ఉంటున్నారు. పైగా కొంతమంది పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని మాకు సూచిస్తున్నారు. అసలు పాక్‌తో ఎందుకు మాట్లాడాలి? ఉగ్రవాదాన్ని ఎందుకు సహించాలి? మేం చర్చలు జరపం. "
-                                                   అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఉగ్రవాదాన్ని ఎట్టపరిస్థితుల్లో ఉపేక్షించలేదని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే కశ్మీర్‌ను శాంతివనంగా తీర్చిదిద్దుతామన్నారు. 

కశ్మీర్‌ ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సైతం కశ్మీర్‌లో శాంతి నెలకొనాలంటే పాక్‌తో చర్చలు జరపాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. 

Also Read: Russia Ukraine Conflict: 'మూడో ప్రపంచ యుద్ధం తప్పదు'- పశ్చిమ దేశాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్!

Published at: 14 Oct 2022 01:30 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.