Gujarat Election Results 2022:


లీడ్‌లో బీజేపీ అభ్యర్థి..


గుజరాత్ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపే సంఘటన జరిగింది. అదే మోర్బి వంతెన కూలిపోవడం. 135 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రతిపక్షాలు బీజేపైపీ విమర్శలు ఎక్కుపెట్టాయి. ఎన్నికల ముందు జరగడం వల్ల ఎంతో కొంత బీజేపీకి డ్యామేజ్ తప్పదని అంచనా వేశారు. మోర్బి నియోజకవర్గంలో బీజేపీ గెలవడం కష్టమేనన్న వాళ్లూ ఉన్నారు. కానీ...ప్రస్తుత ఫలితాల ట్రెండ్ చూస్తుంటే ఆ అంచనాలు తప్పినట్టే కనిపిస్తున్నాయి. మోర్బి నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలోకి దిగిన కాంతిలాల్ అమృతియ లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జయంతి పటేల్, ఆప్‌ అభ్యర్థి పంకజ్ రన్సారియాను వెనక్కి నెట్టి దూసుకుపోతున్నారు. అంటే...మోర్బి వంతెన ఘటన బీజేపీ ఓటుబ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపించలేదని స్పష్టమవుతోంది. మోర్బి నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టేసింది బీజేపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతీయకు అవకాశమిచ్చింది బీజేపీ అధిష్ఠానం. ఆయన ఎందుకంత స్పెషల్ అంటారా..? మోర్బి వంతెన కూలిన సమయంలో అందరూ చూస్తుండగానే నీళ్లలోకి దూకి కొందరి ప్రాణాలను కాపాడారు కాంతిలాల్. ఈ ప్రమాదం జరిగినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులందరూ ఇదే విషయాన్ని చెప్పారు. ఫలితంగా...బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. సెంటిమెంట్ వర్కౌట్ అయితే..ఆయన గెలవటం కష్టమేమీ కాక పోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే...ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది. 


హైకోర్టు ఆగ్రహం..


గుజరాత్‌లో మోర్బి వంతెన కూలిన ఘటనలో 135 మంది మృతి చెందారు. వీరి కుటుంబాలకు పరిహారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే...చాలా తక్కువ మొత్తం వారికి అందిందని తెలుస్తోంది. దీనిపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. భూపేంద్ర పటేల్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "సరైన పరిహారం అందజేయడం అత్యవసరం" అని వ్యాఖ్యానించింది. "తీవ్రంగా గాయ పడిన వారికి ఇచ్చిన ఆ పరిహారం కూడా చాలనే చాలదు" అని స్పష్టం చేసింది. పరిహారం అందజేసే విషయంలో ప్రభుత్వం విధానమేంటో స్పష్టంగా ఓ అఫిడవిట్‌ రూపంలో కోర్టుకి సమర్పించాలని చెప్పింది. అక్టోబర్ 30న ఈ ప్రమాదం జరగ్గా..ఆ రోజే ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు 
రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం భూపేంద్ర పటేల్. గాయపడిన వారికి వైద్యం ఖర్చుల కోసం రూ.50,000 అందజేస్తామని చెప్పారు. అయితే...ఈ పరిహారం ఎంత మాత్రం చాలదని గుజరాత్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది.  అంతే కాదు. రాష్ట్రంలోని అన్ని బ్రిడ్జ్‌లు సరిగా ఉన్నాయో లేదో సర్వే చేపట్టాలని ఆదేశించింది. గుజరాత్ మోర్బి కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ కేసులో విచారణ ఎలా జరుగుతోందో పరిశీలించాని గుజరాత్ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన మిగతా అన్ని వివరాలపైనా దృష్టి సారించాలని తేల్చి చెప్పింది. అడ్వకేట్ విశాల్ తివారీ వేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం...ఈ వ్యాఖ్యలు చేసింది. 


Also Read: Gujarat Election Results 2022: సీఎంగా సాధించలేనిది, పీఎంగా సాధించిన నరేంద్ర మోడీ - గుజరాత్‌లో భారీ ఆధిక్యం