భారత ప్రాదేశిక జలాల్లోకి చొరబడిన పాకిస్థాన్‌కు చెందిన 11 పడవలను భారత సరిహద్దు దళం (బీఎస్‌ఎఫ్) స్వాధీనం చేసుకుంది. గుజరాత్ తీరంలోని హరామీ నాలా వద్ద ఈ ఘటన జరిగింది. సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ పడవలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పడవలతో పాటు ముగ్గురు పాక్ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఆ ప్రాంతంలో అధికారులు గాలింపు చేపడుతున్నారు. మరిన్ని పడవలు దొరికే అవకాశం ఉందని బీఎస్‌ఎఫ్ ఐజీ జీఎస్ మాలిక్ పేర్కొన్నారు. రాణీ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్థానీలు దాక్కునే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించామని, వైమానిక దళానికి చెందిన మూడు కమాండో బృందాలను వేర్వేరు చోట్ల మోహరించినట్లు తెలిపారు.
కీలకం
భారత్‌లోని గుజరాత్‌ను పాకిస్థాన్ సింధ్ ప్రాంతం నుంచి వేరు చేసే 96 కిలోమీటర్ల పొడవైన నీటి పాయను సర్ క్రీక్ అంటారు. ఇది నేరుగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. భౌగోళికంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. ఇక్కడ మత్స్య సంపద అధికంగా ఉంటుంది. ఆసియాలో చేపల వేట జరిగే అతిపెద్ద ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. దీంతోపాటు ఇక్కడ చమురు నిక్షేపాలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు.
ఈ ప్రాంతం వారిదని పాకిస్థాన్ వాదిస్తోంది. 1965 యుద్ధానికి ముందు ఇక్కడ ఒక సైనిక ఘర్షణ జరిగింది. దీనిపై ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయగా.. ఈ భూభాగంలో పది శాతం మాత్రమే పాక్‌కి చెందుతుందని 1968లో తీర్పును వెలువరించింది. కానీ ఇప్పటికీ పాక్ పడవలు ఇక్కడకు వస్తుంటాయి. వీటిని బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంటుంది.
Also Read: SC on Hijab Row: 'హిజాబ్'పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్- విచారణకు సుప్రీం నో