ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని (  Perni Nani  ) హైదరాబాద్‌లో మోహన్‌బాబుతో ( Mohan babu )సమావేశం అయ్యారు. గురువారం రోజు చిరంజీవి బృందం అమరావతికి వచ్చి సీఎం జగన్‌తో నిర్వహించిన చర్చల సారాంశాన్ని పేర్ని నాని మోహన్‌బాబుకు వివరించినట్లుగా తెలుస్తోంది. టిక్కెట్ రేట్లను ఖరారు చేసే ముందు మోహన్ బాబు అభిప్రాయాన్ని కూడా పేర్ని తెలుసుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. టిక్కెట్ రేట్ల అంశంపై గతంలో మోహన్ బాబు స్పందించారు. సినీ పరిశ్రమ అంతా కలసికట్టుగా ఈ అంశం మాట్లాడాలని ఎవరు పడితే వారు స్పందించకూడదన్నారు. ఈ అంశం పూర్తిగా ఫిల్మ్ చాంబర్‌కు చెందినదని "మా" అధ్యక్షుడు, మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ( Manchu Vishnu ) కూడా  ప్రకటించారు. 


 






అయితే చిరంజీవి బృందంతో పాటు మోహన్ బాబుకు ఆహ్వానం అందకపోవడతో మంచు విష్ణు అసంతృప్తితో ట్వీట్ చేసి డిలీట్ చేశారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో సీఎం జగన్‌తో జరిగిన చర్చల్లో ఫిలిం చాంబర్ ప్రతినిధులు కూడా ఎవరూ లేరు. ఈ క్రమంలో మోహన్‌బాబు అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా పేర్ని నాని హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తెలుస్తోంది. నిజానికి టిక్కెట్ రేట్లపై ఎవరు ఎలాంటి అభిప్రాయాలు చెప్పాలనుకున్నా తనను కలవొచ్చని పేర్ని నాని చెబుతూంటారు. రామ్‌గోపాల్ వర్మకు (RGV ) అపాయింట్‌మెంట్ ఇచ్చి తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. 


అలాగే రెండు రోజుల కిందట మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజను కూడా ఆయన అభిప్రాయాలు ఏమైనా ఉంటే నేరుగా తనకు తెలియచేయవచ్చన్నారు. కానీ  పేర్ని నాని మోహన్ బాబు వద్దకు ప్రత్యేకంగా వచ్చి సినిమా టిక్కెట్ రేట్లపై అభిప్రాయాలు తెలుసుకోవడం రాజకీయ, సినీ ఇండస్ట్రీ  ( FIlm Industry ) వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నేరుగా మోహన్ బాబును  చిరంజీవి బృందంతో పాటు ఆహ్వానించి ఉండవచ్చు కదా అనే చర్చ టాలీవుడ్‌లో జరిగింది. 


వైఎస్ఆర్‌సీపీతో అత్యంత సన్నిహితంగా ఉండే అలీ, పోసాని కృష్ణమురళితో పాటు నారాయణ మూర్తిని కూడా పిలిచి మోహన్ బాబును పిలవకపోవడం ఏమిటని కొంత మంది భావించారు. గత ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైఎస్ఆర్‌సీపీలో చేరారు. అధికారికంగా ఆయన ఆ పార్టీ నేతే. అందుకే పేర్ని నాని ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి మోహన్ బాబుతో సమావేశం అయినట్లుగా తెలుస్తోంది.  భేటీ అధికారికం కాకపోవడంతో  సమావేశ వివరాలను వెల్లడిస్తారో లేదో స్పష్టత లేదు.