Greece Wildfire: ద్వీప సమూహం గ్రీస్‌ను కార్చిచ్చు చుట్టేస్తోంది. ఇటీవల గ్రీస్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంట్రీగేడ్‌లు దాటడంతో కార్చిచ్చు అంటుకుంది. పలు ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి.. ఇళ్లు, హోటళ్లను దహనం చేసుకొంటూ జనావాసాలపైకి వేగంగా వ్యాపిస్తోంది. రోడ్సే ప్రాంతంలో దాదాపు వారం క్రితం రేగిన మంటలు వేగంగా విస్తరిస్తూ మధ్యగ్రీస్, తూర్పు ప్రాంతాల్లోకి వ్యాపిస్తున్నాయి.
మంటలను ఆర్పేందుకు ఈ చిరు దేశం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 40 ఫైర్ ఇంజిన్లు, 200 మంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. మూడు విమానాలు, ఐదు హెలికాప్టర్లు ఈ మంటలను ఆర్పేందుకు ఉపయోగిస్తున్నాయి. ఐరోపా సమాఖ్య దేశాలు సైతం తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. తుర్కియే, జోర్డాన్, ఇజ్రాయెల్, క్రొయేషియా దేశాలు సైతం గ్రీస్‌ను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందించి అండగా నిలిచాయి. తాజాగా ఈ కార్చిచ్చు కోర్ఫు ప్రాంతానికి వ్యాపించాయి. రాత్రివేళల్లో వేగంగా వ్యాపిస్తూ కొండలు అగ్నిపర్వతాలను తలపిస్తున్నాయి. ఇవి ఆగ్నేయ దిశగా వ్యాపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ కార్చిచ్చును కొంత అదుపులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మంటలు సమీపిస్తున్న ప్రాంతం నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 19,000 మంది స్థానికులు, పర్యాటకులను రోడ్సే నుంచి గ్రీస్ అధికారులు కాపాడారు. వీరిలో 16 వేల మందిని భూమార్గంలో 3,000 మందిని సముద్ర మార్గాన తరలించారు. కార్చిచ్చుకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లలు, సామగ్రిని తీసుకొని ప్రజలు కాలినడకనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. కొందరు బీచ్‌ల్లోనే తాత్కాలిక ఆశ్రయం ఏర్పాటు చేసుకుంటున్నారు. రోడ్సే అగ్ని కీలకలలు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో విమాన సర్వీసులు కూడా పూర్తిగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అక్కడి ఎయిర్‌పోర్టులోనే తలదాచుకుంటున్నారు. వేలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. పలు దేశాలు సహాక సామగ్రి, బృందాలను అక్కడకు తరలిస్తున్నాయి.
మంటలు కోర్ఫ్ వైపు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో అక్కడి నుంచి 2,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రీకు చరిత్రలోనే తొలిసారి రోడ్సే నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించారు. బ్రిటిష్ పర్యటకులు ఎక్కువగా వెళ్లే కోర్ఫ్ మంటలు చుట్టుముట్టాయని, కొందరు వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్ఫ్ సమీపంలోని శాంటా, మెగౌలా, పోర్టా, పాలియా పెరిథియా మరియు సినీస్‌లోని ప్రజలను కాసియోపికి తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంటలపై UK ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తలలో ఒకరు మాట్లాడుతూ.. మంటలు వాతావరణ మార్పులకు హెచ్చరికగా భావించాలన్నారు. భవిష్యత్తులో మరింత తీవ్రమైన మంటలు చెలరేగే అవకాశం ఉందన్నారు. మధ్యధరా ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు గ్రీక్ అడవి మంటలు ఒక పెద్ద హెచ్చరిక అన్నారు. UK మాజీ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్, క్లైమేట్ క్రైసిస్ అడ్వైజరీ గ్రూప్ ఛైర్మన్ సర్ డేవిడ్ కింగ్ మాట్లాడుతూ.. దక్షిణ ఐరోపాలో వేడిగాలుల కారణంగా చాలా మంది ప్రజలు మరణించే అవకాశం ఉందని హెచ్చరించారు. పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రీన్హౌస్ వాయువుల కారణంగా ఆర్కిటిక్‌లో మంచు కరుగి విపరీతమైన ఉష్ణోగ్రతలు సంభవిస్తాయన్నారు.