Making Of Cakes: కొన్ని ఆహారం తయారు చేసే వీడియోలు చూస్తే నోరూరుతుంది. కొన్ని వీడియోలు చూస్తే వాటిపై విరక్తి పుడుతుంది. కొన్ని  వంటకాలను ఎలా తయారు చేస్తారో చూస్తే వారిని కచ్చితంగా అభినందించాల్సిందే. మరి కొన్ని చూస్తే వాటిని తినాలనే కోరిక చచ్చిపోతుంది. ఇలాంటి వీడియోలు తరచూ వీడియో బ్లాగ్‌లు, రీల్స్, షార్ట్స్‌లో చూస్తూనే ఉంటాం. వీటి కోసం అంటూ ప్రత్యేకంగా ఫుడ్ వ్లాగర్లు పుట్టుకొచ్చారంటే అతిశయోక్తికాదు. వీరంతా పలు ప్రదేశాల్లో తిరుగుతూ ఫుడ్ ఎలా తయారు చేస్తారో వివరిస్తూ.. వాటి రుచుల గురించి చెబుతారు. వాటిలో కొన్ని అనుకోని విధంగా వైరల్‌గా మారిపోతాయి. గత నెలలో, చాక్లెట్ ఐస్ క్రీం తయారీని చూపించే ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఒకటి వైరల్ అయ్యింది. అంతకు ముందు మర్మురా, సాల్టెడ్ వేరుశెనగకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిని ఎలా తయారు చేస్తారో చూపించే వీడియో చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. తాజాగా ఇలాగే కేకు తయారీ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 






ఆహారం తెరవెనుక వాస్తవాలు పేరుతో ఓ నెటిజన్ ఈ కేకు తయారీ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఓ ఒక వ్యక్తి గుడ్లను పగులగొట్టడం, వాటిని అన్నింటినీ ఒక భారీ కంటైనర్‌కు బదిలీ చేశాడు. వాటిలో కొంచెం తెలియని నీరు, ద్రావణం, కేకుల తయారీకి ఉపయోగించే పిండి పోశాడు. కొంత సేపు దానిని యంత్రం సాయంతో తిప్పి కేకు తయారు చేసే ట్రేలో నింపి బేకింగ్ కోసం గోడ ఓవెన్‌లో ఉంచారు. పూర్తయిన తర్వాత, వాటిని ఐసింగ్ సహాయంతో డీమోల్డ్ చేసి శాండ్‌విచ్ చేశారు. 






ఆ తరువాత లవ్ ఆకారంలో కత్తిరించాడు. క్రీం పూసి ఒక పసుపు సిరప్ దానిపై గ్లేజ్గా పోశారు. క్రీమీ పూలతో కేక్‌ని అలంకరించాడు. బటర్‌క్రీమ్‌తో పక్షి లాంటి ఆకారాలను ఏర్పాటు చేసి దానిని సుందరంగా తీర్చి దిద్దాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని చూసిన కొందరు నెటిజన్లు కేకు తయారీ వెనుక ఇంత తతంగం ఉందా అని అవాక్కవుతున్నారు. కొందరు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై జీవితంలో కేకు తనమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత అపరిశుభ్రంగా తయారు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. 


మరి కొందరు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. కొన్ని తయారీదారులు ఇలా చేస్తుంటారని, తమ ఇళ్లలో తయారు చేసిన విధంగా ఉండాలి అంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేకులు తయారీ చేసే బేకరీలు, రెస్ట్రారెంట్లకు కొన్ని మార్గదర్శకాలు ఉండాలని సూచిస్తున్నారు. కేవలం ప్రముఖ, తెలిసన కంపెనీల నుంచే కేకులు కొనాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను మీరు చూసి, మీ ప్రాంతంలో కేక్ ఎలా తయారు చేస్తారో తెలపండి. మీరు ఎలాంటి ఫుడ్ తినడానికి ఇష్టపడతారో చెప్పండి.