Wheat Production in India:


సరిపడ నిల్వలున్నాయ్..


దేశీయ అవసరాల కోసం భారత్ గోధుమల్ని దిగుమతి చేసుకోనుందన్న వార్తలపై కేంద్రం స్పందించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇతర దేశాల నుంచి గోధుమల్ని దిగుమతి చేసుకోవటం లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వెల్లడించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వద్ద సరిపడా నిల్వలున్నాయని, ప్రజా పంపిణీలో ఎలాంటి సమస్యలు రావని తెలిపింది. దేశీయ అవసరాలకు ఇబ్బంది తలెత్తదని పేర్కొంది. ట్విటర్ వేదికగా ఈ విషయం స్పష్టం చేసింది. "గోధుమల్ని దిగుమతి చేసుకునే ఆలోచన లేదు. 
దేశీయ అవసరాలకు సరిపడ నిల్వలున్నాయి" అని ట్వీట్ చేసింది. ఈ ఏడాది రబీ పంటకు ముందు విపరీతమైన వేడి గాలులు వీచాయి. ఆ సమయంలో గోధుమ పంట దిగుబడిపై ప్రభావం పడింది. 2021-22 మధ్య కాలంలో గోధుమ దిగుబడి 106.84 మిలియన్ టన్నులకు పడిపోయింది. నిజానికి ఈ ఏడాది 111 మిలియన్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ...ఆ స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక..ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. రికార్డు స్థాయి ధరలు పలికాయి. వేడిగాలుల కారణంగా దిగుబడి పడిపోవటమూ ధరల పెరుగుదలకు ఓ కారణం. రష్యా, ఉక్రెయిన్‌ పెద్ద ఎత్తున గోధుమల్ని విదేశాలకు ఎగుమతి చేస్తాయి. అక్కడ సరఫరా వ్యవస్థలు నిలిచిపోవటం వల్ల ఆ దేశాలపై ఆధారపడిన దేశాల్లో తిప్పలు తప్పటం లేదు.





 


ఎగుమతులపై ఆంక్షలు..


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో టన్ను గోధుమల ధర రూ.2,400-2,500గా పలికింది. అయితే  రబీలో పండించిన గోధుమలు మండీల్లోకి వచ్చాక..కాస్త ధరలు తగ్గాయి. అయినా...కనీస మద్దతు ధర కన్నా ఎక్కువే పలుకుతున్నాయి ధరలు. టన్నుకి రూ.2,015 ఎమ్‌ఎస్‌పీ ఉంది. గోధుమల ఎగుమతుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు...విమర్శలకు తావిచ్చినా...ప్రస్తుతానికైతే కొంత వరకూ ధరలు తగ్గటానికి కారణమయ్యాయి. చాలా రోజుల పాటు గోధుమల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేసింది కేంద్రం. గోధుమ ఎగుమతులను ఇప్పటికే నిషేధించిన కేంద్ర ప్రభుత్వం, తరవాత గోధుమ పిండి ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. దేశీయంగా ధరల్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో ప్రకటించింది. ఈ ఏడాది మే ముందు వరకూ గోధుమలు భారీగానే ఎగుమతి చేసింది భారత్. ఈ కారణంగా దేశీయంగా నిల్వలు నిండుకున్నాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే, ఇక్కడా కొరత ఏర్పడుతుందని గ్రహించిన కేంద్రం, వెంటనే ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది. తరవాత గోధుమ పిండి విషయంలోనూ ఆ ఆంక్షల్ని కొనసాగించింది. గోధుమ పిండి ఎగుమతిదారులు, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు సరఫరా చేయటానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది.


దేశీయంగా నిల్వలు గమనించుకుని, నాణ్యతను పరిశీలించి, ప్రభుత్వ అనుమతితోనే ఎగుమతి చేయాలని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఉన్న కొరతతో కొందరు కావాలనే బ్లాక్ మార్కెట్‌ను సృష్టించే ప్రమాదముందని అంటోంది కేంద్రం. ఈ కారణంగా నాణ్యత లోపించే అవకాశముందని అభిప్రాయపడింది. భారత్ గోధుమలు ఎగుమతులు నిషేధించిన సమయంలో అంతర్జాతీయంగా ఒక్కసారిగా  ధరలు పెరిగిపోయాయి. ఈ నిర్ణయంపై పలు దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. భారత్ మాత్రం దేశీయంగా ధరల్ని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలు తప్పవని స్పష్టం చేసింది.  


Also Read: Congress Meeting: భారత్ జోడో యాత్రకు రెడీ అవుతున్న కాంగ్రెస్, అక్కడి నుంచే మొదలు