Girl Fakes Her Kidnapping: ఫారిన్ వెళ్లేందుకు కిడ్నాప్ నాటకమాడి తల్లిదండ్రుల్ని టెన్షన్ పెట్టింది ఓ 21 ఏళ్ల యువతి. తనను ఎవరో కిడ్నాప్ చేశారని రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్నారని చెప్పింది. కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కూపీ అంతా లాగితే ఆ అమ్మాయి నాటకం ఆడిందని తేలింది. రాజస్థాన్‌లోని కోటాలో జరిగిందీ ఘటన. ఇంకా ఆ యువతి ఆచూకీ దొరకలేదు. రాజస్థాన్‌లోని కోటాలో NEET కోచింగ్ కోసం కావ్యని పంపారు. అక్కడే హాస్టల్‌లో చేర్చారు తల్లిదండ్రులు. ఆ హాస్టల్‌లో మొత్తం ఏడాదిలో కేవలం మూడు రోజులు మాత్రమే ఉందని తెలిసింది. ఈ మధ్యలో ఎక్కడా అనుమానం రాకుండా తరచూ ఫొటోలు, వీడియోలు పంపింది కావ్య. హాస్టల్‌లోనే ఉన్నట్టుగా నమ్మించింది. పేరెంట్స్ కూడా పెద్దగా ఆలోచించలేదు. అమ్మాయి బానే ఉంటోందని అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఓ వ్యక్తి వాళ్లకి కాల్ చేసి అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు చెప్పాడు. రూ.30 లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని డిమాండ్ చేశాడు. అంతే కాదు. ఆమెని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసిన ఫొటోలు, వీడియోలు పంపాడు. వెంటనే కావ్య తండ్రి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన కూతురుని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు చివరిసారిగా కావ్య ఇండోర్‌లో ఉన్నట్టు గుర్తించారు.
ఆ తరవాత పూర్తి స్థాయిలో విచారించగా ఆమె కోటాలోని హాస్పిటల్‌లో మూడు రోజులు ఉన్నట్టు తెలిసింది. ఆ తరవాత అక్కడి నుంచి ఇండోర్‌కి వెళ్లి అక్కడే ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఉంటోందని తేలింది. కానీ తాను ఇంకా హాస్టల్‌లో ఉంటున్నట్టు తల్లిదండ్రుల్ని నమ్మించిందని పోలీసులు వెల్లడించారు. రోజూ టెస్ట్‌లు రాస్తున్నట్టు మెసేజ్‌లు కూడా పంపేది. ఇదంతా తెలిసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. కావ్య ఫ్రెండ్స్‌ని విచారించగా తాను ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్లిపోవాలని అనుకుంటోందని చెప్పారు. అప్పటి నుంచి డబ్బు కోసం ఎదురు చూస్తోందని, ఇందుకోసమే ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్టు అసలు నిజం చెప్పారు. కామన్ ఫ్రెండ్ రూమ్‌లో కావాలనే ఇలా కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసి ఫొటోలు పంపినట్టు పోలీసులకు వెల్లడించారు. అయితే...అసలు కావ్య కోచింగ్ సెంటర్‌లో చేరనే లేదని తెలిసింది. ఎక్కడా అడ్మిషన్ తీసుకోలేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతానికి కావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె దొరికితే కానీ పూర్తి వివరాలు చెప్పలేమని అంటున్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లకీ ఈ వివరాలు అందించారు.