E KYC Process on Gas Cylinder Distribution: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో 6 గ్యారెంటీల అమలు చేసేలా ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే 'మహాలక్ష్మి' (Mahalaxmi) కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు వంటి వాటిని అమలు చేశారు. మిగిలిన హామీలను కూడా అమలు చేసేలా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో రూ.500కే గ్యాస్ సిలిండర్ (500 Rupees Gas Cylinder) అందిస్తామని ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్ అందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి అని కొందరు ప్రచారం చేశారు. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు ఈ కేవైసీ ప్రక్రియ కోసం పరుగులు తీశారు. అయితే, ఇప్పటివరకూ రూ.500లకే సిలిండర్ హామీ అమలుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు అందలేదని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అలాగే 'ఈ కేవైసీ' కోసం కూడా గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.


ఇంటి వద్దే ఈ కేవైసీ


గ్యాస్ సిలిండర్ ఈ కేవైసీకి సంబంధించి ఆఫీసులకు గుంపులుగా వచ్చి ఇబ్బందులు పడొద్దని ప్రజలకు సూచించారు. డెలివరీ బాయ్స్ వద్దే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ ఈ కేవైసీకి సంబంధించి కేంద్రం ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని, వీలైనంత త్వరగా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి కేవైసీ పూర్తి చేయాలని తమకు ఆదేశాలు అందినట్లు చెప్పారు. డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చెయ్యొచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ బాయ్స్ వద్ద ఎవరిదైనా పూర్తి కాకపోతే, అలాంటి వారు మాత్రమే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్లాలని తెలిపారు.


రూ.500కే సిలిండర్ పై కసరత్తు


మరోవైపు, 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని పౌర సరఫరాల శాఖకు తాజాగా ఆదేశాలు అందాయి. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం ఆ శాఖ 2 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేషన్ కార్డు ఉన్న వారితో పాటు లేని వారిలోనూ లబ్ధిదారులను ఎంపిక చేయడం ఒకటి, రేషన్ కార్డులతో సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం ఇంకొకటిగా ప్రతిపాదించింది.


సుమారు కోటి కనెక్షన్లు


తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా హెచ్‌పీసీఎల్‌ నుంచి 43.40 లక్షలు, ఐఓసీఎల్‌ నుంచి 47.97 లక్షలు, బీపీసీఎల్‌ నుంచి 29.04 లక్షల వినియోగదారులు ఉన్నారు. వీరిలో 44 శాతం మంది అంటే 52.80 లక్షల మంది ప్రతి నెలా సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. 89.99 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఉండగా, తొలి ప్రతిపాదన ప్రకారం వీరికి పథకాన్ని వర్తింపచెయ్యొచ్చు. అయితే, వీరిలో అనర్హులు కూడా లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండో ప్రతిపాదన మేరకు లబ్ధి దారుల ఎంపికకు సమయం ఎక్కువ పడుతుంది. ఈ మేరకు నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారులు అందజేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.955 కాగా, సాధారణ కనెక్షన్లు ఒక్కో బుకింగ్ కు కేంద్రం రూ.40 రాయితీ అందిస్తోంది. ఉజ్వల్ కనెక్షన్లకు రూ.340 రాయితీ లభిస్తోంది. తెలంగాణలో మొత్తం 11.58 లక్షల ఉజ్వల్ కనెక్షన్లుండగా, కేంద్రం విజ్ఞప్తి మేరకు 'గివ్ ఇట్ అప్'లో భాగంగా రాష్ట్రంలో 4.2 లక్షల మంది రాయితీ వదులుకున్నారు. ఈ పథకం కింద ఏడాదికి ప్రతి లబ్ధిదారునికి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తే ప్రభుత్వంపై దాదాపు రూ.2,225 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. అదే 12 సిలిండర్లు ఇస్తే ఆ భారం డబుల్ అవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.


Also Read: Breaking News Live Telugu Updates: తెలంగాణ అసెంబ్లీలో నేడు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్