Adilabad RIMS Case: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి గురువారం రిమ్స్ మెడికల్ కాలేజ్ ను సందర్శించి విచారణ ప్రారంభించారు. ఈ మేరకు రిమ్స్ సిబ్బందితోపాటు బాధిత విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అందరితో మాట్లాడి వివరాలు సేకరించిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఆ రిపోర్టును కలెక్టర్‌కు అందజేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కమిటీ పేర్కొంది.


వైద్య విద్యార్థులపై బయటి వ్యక్తులు వచ్చి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ అన్నారు. దాడికి పాల్పడిన డాక్టర్ క్రాంతిని టర్మినేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. రిమ్స్‌లో సెక్యూరిటీని పెంచుతామన్నారు. మెడికల్ విద్యార్థులపై దాడికి పాల్పడిన డాక్టర్ క్రాంతి కుమార్ ఏ1గా పేర్కొన్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. 


బయట వ్యక్తులు దాడి చేస్తున్న క్రమంలో తమను తాము రక్షించుకునేందుకు మెడికో విద్యార్థులు కూడా ప్రతి దాడులు చేశారు. ఈ పెనుగులాటలో శివకుమార్ అనే వ్యక్తి చేయి విరిగింది. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయనపై కూడా ఏ2గా కేసు నమోదు అయింది. వీరితోపాటు రిమ్స్ డైరెక్టర్, దాడిలో పాల్గొన్న బయట వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు పోలీసులు.


రిమ్స్ వైద్య కళాశాలలోకి బయట వ్యక్తులు ప్రవేశించి వైద్య విద్యార్థులపై దాడులకు పాల్పడడంతో వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల అవరణలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూర్చొని నిరసన చేపట్టారు. బయట వ్యక్తులు రిమ్స్ కళాశాలలోకి చొరబడుతున్నారని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని, రిమ్స్ డైరెక్టర్‌ను మార్చాలంటూ డిమాండ్ చేసారు. ఈ నిరసన సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగింది. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్‌తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులతో చర్చలు జరిపారు.


వైద్య విద్యార్థులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి ఘటనలు పునవృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వైద్య కళాశాల ఆవరణలో సెక్యూరిటీని పెంచుతామని డైరెక్టర్ చెప్పడంతో విద్యార్థులు శాంతించలేదు. తమ నిరసనను కొనసాగిస్తామని చెప్పారు. అసలు ఈ వైద్య కళాశాలలో డైరెక్టర్‌ను మార్చితేనే అన్ని బాగుంటాయని అందరికీ సరైన న్యాయం జరుగుతుందని విద్యార్థులు నినదించారు. రిమ్స్ డైరెక్టర్ మాకొద్దు డైరెక్టర్‌ను మార్చే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని, వీధులకు హాజరుకామని స్పష్టం చేశారు.