సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సఫారీ గడ్డపై టీమిండియా జూలు విదిల్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటుతో విధ్వంసం సృష్టించగా.. కుల్‌దీప్ యాదవ్ బంతితో మాయ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికాను చిత్తు చిత్తుగా ఓడించి భారత జట్టు సిరీస్‌ను సమం చేసింది. రెండో టీ 20లో భారీ స్కోరు చేసిన ఓడిపోయిన టీమిండియా... మూడో టీ 20లో అద్భుతంగా పుంజుకుని ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. దీంతో 160 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్... రికార్డుల వేట కొనసాగించాడు. అంతర్జాతీయ టీ20ల్లో మరో సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.
ఈ మ్యాచులో 55 బంతుల్లోనే సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డును సూర్యకుమార్ యాదవ్ సమం చేశాడు. సూర్య కుమార్ ఇప్పటివరకు 4 సెంచరీలు చేశాడు. 57 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించాడు. మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్సుల్లో, రోహిత్ శర్మ 140 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించగా సూర్యకుమార్ యాదవ్ కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే నాలుగు శతకాలు సాధించి సత్తా చాటాడు. అంతేకాకుండా టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా సూర్య రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 117 సిక్సుల రికార్డును సూర్యకుమార్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది సిక్సులతో 122 సిక్సులు కొట్టి... టీ 20లో అత్యధిక సిక్సులు కొట్టిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. తొలి స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ 20లో ఆరంభంలో సూర్య ఆచితూచి ఆడాడు. సూర్య నెమ్మదించడంతో స్కోరు బోర్డు నిదానంగా కదిలింది. సూర్య తానెదుర్కొన్న తొలి 24 బంతుల్లో 26 పరుగులే చేశాడు. టీమిండియా 10 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. పది ఓవర్ల తర్వాత సూర్యకుమార్ యాదవ్ గేరు మార్చాడు. సిక్స్‌ల మోతతో కనువిందు చేశాడు. మహరాజ్ బౌలింగ్‌లో సిక్స్‌తో మొదలు పెట్టిన సూర్య... ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
13వ ఓవర్లో ఫెలుక్వాయో బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. వరుసగా 6, 4, 6, 6 బాదడంతో ఆ ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. బర్గర్ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6 కొట్టేశాడు. ఈ విధ్వంసంతో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 32 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన సూర్య.. మరో 23 బంతుల్లోనే శతకానికి చేరుకున్నాడు. 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సులతో సూర్య శతకాన్ని అందుకున్నాడు. చివరి ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసి శతకం పూర్తి చేసిన సూర్య.. ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. టీమిండియా ఇంకా భారీ స్కోరు చేసేదే కానీ చివరి రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 15 పరుగులే చేసింది. 19వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చిన షంసి.. రింకు (14)ను ఔట్ చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం ప్రొటీస్ కేవలం 95 పరుగులకే కుప్పకూలింది.