Candida Auris Fungus: అమెరికాలో ప్రాణాంతక ఫంగస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. Candida aurisగా పిలిచే ఈ అరుదైన ఫంగస్ ఇప్పటికే నలుగురికి సోకింది. ఈ ఫంగస్ సోకిన వాళ్లు చనిపోయే ముప్పు ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడం వల్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని తేల్చి చెబుతున్నారు. జనవరి 10వ తేదీన తొలి కేసు నమోదైంది. ఆ తరవాత మరో ముగ్గురికి ఇది సోకినట్టు అక్కడి ప్రజారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ ఫంగస్ చాలా సులభంగా దాడి చేస్తుందని స్పష్టం చేశారు. అంతే కాదు. యాంటీ ఫంగల్ డ్రగ్స్‌కి కూడా ఇది లొంగడం లేదని వివరిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వాళ్లని ఈ ఫంగస్‌ సోకితే ప్రాణాంతకమవుతుందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ సమస్యలున్న వాళ్లకూ ప్రమాదమే.  


అదే ప్రమాదం..


Centres for Disease Control (CDC) వెల్లడించిన వివరాల ప్రకారం...శరీరంలో ఎక్కడైనా ఈ ఫంగస్ దాడి చేసే అవకాశముంది. చెవులు, గాయాలతో పాటు నేరుగా రక్తంలోకీ ఇది సోకే ప్రమాదముంది. ఈ తీవ్రతను బట్టి లక్షణాలుంటాయని వైద్యులు వెల్లడించారు. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలకి Candida auris లక్షణాలకి పెద్దగా తేడా కనిపించదని అందుకే అది మరింత ప్రమాదకరమవుతోందని చెబుతున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌కి సంబంధించి ప్రత్యేకంగా లక్షణాలు అంటూ ఏమీ లేవని స్పష్టం చేస్తున్నారు. కొన్ని సార్లు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా శరీరంలో ఎక్కడో ఓ చోట ఈ ఫంగస్‌ ఉంటుంది. దీన్నే colonizationగా పిలుస్తున్నారు వైద్యులు. అంటే...తెలియకుండానే ఈ ఫంగస్‌ని ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతుంది. లక్షణాలు కనిపించకపోవడం వల్లే ఎక్కువ మందికి సోకుతూ ప్రమాదకరంగా మారుతోంది.  



వైద్యుల సూచనలివే..


ఈ ఫంగస్ సోకిందని గుర్తిస్తే వెంటనే ఆ వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచాలి. డిస్‌ఇన్‌ఫెక్టెంట్స్‌తో గదిని శుభ్రం చేయాలి. వాళ్లకు నీళ్లు, ఆహారం అందించే వాళ్లు కచ్చితంగా గ్లోవ్స్ తొడుక్కోవాలి. ఆల్కాహాల్‌ ఉన్న శానిటైజర్‌నే వినియోగించాలి. 15 ఏళ్ల క్రితమే జపాన్‌లో ఈ ఫంగస్‌ని గుర్తించారు. కొన్నేళ్లుగా ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. 2022లో 2,377 మంది ఈ ఫంగస్‌ బారిన పడ్డారు. 2016లో బాధితుల సంఖ్య 53కే పరిమితమైంది. అయితే...ఎక్కువగా ఇది అమెరికాలోని రాష్ట్రాల్లోనే వ్యాపిస్తోంది. అగ్రరాజ్యంతో పాటు మరో 40 దేశాల్లో ఈ ఫంగస్‌ ఉనికి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఈ ఫంగస్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. 2021లో 1,471 మంది దీని బారిన పడినట్టు CDC స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ కేసులు నమోదవుతున్న చోట అధికారులు అప్రమత్తమయ్యారు. వీలైనంత వరకూ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. శానిటైజర్‌లు వినియోగించాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. 


Also Read: LK Advani Political Journey: రథయాత్ర నుంచి భారతరత్న వరకూ, అద్వానీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు