Viral Video: ఇండియన్ ఆర్మీకి సాహసాలు చేయడం కొత్త కాదు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా చాలా సులువుగా దాటేస్తారు. అలా ప్రతిసారీ అందరితో జై జవాన్ అనిపించుకుంటారు. ఇప్పుడు మరోసారి అలాంటి సాహసమే చేసి రియల్ హీరోస్ అని అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం విపరీతంగా మంచు కురుస్తోంది. దారులన్నీ మూసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుప్వారాలో ఓ గర్భిణి నొప్పులతో బాధ పడుతోంది. కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్థం కాక రాత్రి 11 గంటలకు దగ్గర్లోని విల్గమ్ ఆర్మీ క్యాంప్‌కి కాల్ చేసి సాయం అడిగారు. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వెంటనే వచ్చి కాపాడాలని రిక్వెస్ట్ చేశారు. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ సాయం చేసేందుకు రంగంలోకి దిగింది. కానీ రెండు రోజులుగా కురుస్తున్న మంచుతో దారంతా నిండిపోయింది. వాహనాలు వెళ్లే అవకాశమే లేదు. అయినా సరే వెనక్కి తగ్గకుండా జవాన్లు ఆమెని రక్షించేందుకు ముందుకొచ్చారు. స్ట్రెచర్‌పై ఆమెని  పడుకోబెట్టి మోసుకుంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. "సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ" అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఆమెని కాపాడారంటూ ప్రశంసిస్తున్నారు.