Elon Musk Twitter:
ఎన్ని మార్పులో..
ఎలన్ మస్క్. ఈ పేరు ఎప్పుడూ సంచలనమే. చాలా నిక్కచ్చి మనిషి. పని రాక్షసుడు. పట్టు పడితే వదలడు. ఆయన కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ఇలాంటి "విశేషణాలు" ఎన్నో చెబుతుంటారు. ఇప్పుడీయనే ట్విటర్‌తో డీల్ మాట్లాడుకుని చివరకు ఆ కంపెనీని హస్తగతం చేసుకున్నాడు. ఇదంతా పాత కథే. కానీ...ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే ఆ కంపెనీలో మార్పులు మొదలు పెట్టారు. రోజుకో కొత్త సంచలన అప్‌డేట్‌తో "టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా"గా మారిపోయారు. అటు ఉద్యోగులకూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. "ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా" అనే టెన్షన్‌తో పని చేస్తున్నారు ఉద్యోగులంతా. ఎప్పుడు "You Are Fired" అనే మెయిల్ వస్తుందో అని తెగ భయపడిపోతున్నారు. కేవలం వారం రోజుల్లో ఆ కంపెనీ రూపు రేఖలు మారిపోయే నిర్ణయాలు తీసుకున్నారు ఎలన్ మస్క్. డీల్ క్లోజ్ కాకముందే..ట్విటర్ మేనేజ్‌మెంట్‌పై సంచలన విమర్శలు చేసిన మస్క్...ఇప్పుడు "బాస్" అవ్వగానే తన స్టైల్‌లో సంస్కరణలు చేపడుతున్నారు. అవేంటో చూద్దాం.
పరాగ్‌తో మొదలు..
ట్విటర్ బాస్ అయిన మరుక్షణమే మస్క్ చేసిన పని షాక్‌కి గురి చేసింది. భారత సంతతికి చెందిన CEO పరాగ్ అగర్వాల్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. నిజానికి..అంతకు ముందు నుంచే మస్క్, పరాగ్ అగర్వాల్ మధ్య సైలెంట్‌గా వైరం నడుస్తూనే ఉంది. ట్విటర్ వేదికగా రెండు మూడు సార్లు వీళ్ల మధ్య యుద్ధం కూడా నడిచింది. ఒకానొక సమయంలో "మస్క్ నిబంధనలకు లోబడటం లేదు" అని డీల్ కుదుర్చుకునే
సమయంలో ట్విటర్ మేనేజ్‌మెంట్‌పై ఆయనపై ఫైర్ అయింది. సరే. ఈ కథంతా ముగిసింది కానీ...మస్క్ మాత్రం అది మనసులో పెట్టుకున్నట్టున్నాడు. బాస్ అయిన వెంటనే ఎగ్జిగ్యూటివ్ స్థాయిలో ఉన్న వారిని ఇంటికి పంపారు.
ఇండియన్స్‌పై గురి పెట్టారా..?
ఈ లేఆఫ్‌లు ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులతోనే ఆగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ...మస్క్ ట్విస్ట్ ఇచ్చారు. కింది స్థాయి ఉద్యోగులకూ ఉద్వాసన పలికేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు. దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నట్టు ఇప్పటికే కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. అయితే..ABP News సోర్సెస్ ప్రకారం తెలుస్తోంది ఏంటంటే...ఇండియన్ ఎంప్లాయిస్‌ను టార్గెట్ చేసుకుని మరీ వారిని తొలగించాలని చూస్తున్నారట. కొందరు ఈ మేరకు సమాచారం కూడా ఇచ్చారు.
ఎందుకిలా..?
ఈ లేఆఫ్‌లు ఎందుకంటూ ట్విటర్ వేదికగా మస్క్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు చాలా మంది నెటిజన్లు. దీనికి కూడా ఆయన వివరణ ఇస్తున్నారు. ట్విటర్‌కు రోజుకు 4 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతోందని అందుకే..కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఉద్యోగులను తొలగించటం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పారు. అంతే కాదు. "ఫైర్" అయిన వాళ్లకు మూడ నెలల జీతం ఇస్తామని వివరించారు. లీగల్‌గా చూసుకుంటే ఇది 50% ఎక్కువేనని స్పష్టం చేశారు మస్క్.
బ్లూటిక్ రగడ..
ట్విటర్ బ్లూ యూజర్స్ "Blue Tick"ని మెయింటేన్ చేయాలంటే నెల నెలా 8 డాలర్లు చెల్లించాలని ప్రకటించారు ఎలన్ మస్క్. "ప్రస్తుతం ఉన్న ట్విటర్ బ్లూ విధానం మరీ చెత్తగా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా" అని స్పష్టం చేశారు మస్క్. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో నవంబర్ 7వ తేదీ నుంచి ట్విటర్ బ్లూ అందుబాటులోకి రానుంది.
కంటెంట్ పాలసీలో మార్పులు..?
ప్రస్తుతానికి కంటెంట్ పాలసీలో ఎలాంటి మార్పులు లేవనే సంకేతాలిచ్చారు మస్క్. దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ సహా మరి కొందరి ప్రముఖుల అకౌంట్‌లను బ్యాన్ చేయాలని అనుకోవడం లేదనీ అన్నారు. కొత్తగా కంటెంట్ మాడరేషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన తరవాతే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. ఇందుకు మరి కొన్ని వారాల సమయం పట్టేలా ఉంది.
వీడియో కంటెంట్‌కూ డబ్బులు కట్టాలా..?
ఎలన్ మస్క్..ట్విటర్‌లో వీడియో కంటెంట్‌కి కూడా డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నట్టు The Guardian పత్రిక ఆ మధ్య వెల్లడించింది. ఎవరైనా వ్యక్తి వీడియోలు పోస్ట్ చేస్తే...వాటిని చూసేందుకు యూజర్లు డబ్బులు చెల్లించేలా మార్పులు చేస్తారని తెలుస్తోంది. దీనిపై కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. మొత్తానికి వారం రోజుల్లో ఇలాంటి సంచలన మార్పులెన్నో తీసుకొచ్చారు మస్క్.