విశాఖలో పరువు హత్య కలకలం రేపింది. పరువు పేరుతో కన్న కూతుర్ని ఆమె తండ్రి హత్య చేశాడు. ఇదివరకే పెద్ద కుమార్తె ఓ యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. చిన్న కూతురు సైతం ప్రేమ అంటూ స్థానిక యువకుడితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి తన కన్న కూతుర్ని దారుణంగా హత్య చేశాడు. హత్య చేయడానికి గల కారణాలను సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కుమార్తెను హత్య చేసిన అనంతరం విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుడు లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇది పరువు హత్య అని ప్రాథమికంగా తెలిపారు.
విశాఖపట్నం వన్ టౌన్ లోని రెల్లి వీధిలో వరప్రసాద్ (45) నివాసం ఉంటున్నాడు. నగరంలోని మహా ప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కొన్నేళ్ల కిందట భార్య వర ప్రసాద్ ను వదిలి వెళ్లిపోయింది. అయినా తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించాడు. ఇద్దరు కుమార్తెలకు ఏ ఇబ్బంది లేకుండా పెంచాడు. వారికి కావాల్సిన స్కూల్స్ లో చదివిస్తూ వారి ఆలనాపాలనా చూసుకున్నాడు. కానీ కొన్నేళ్ల కిందట వరప్రసాద్ పెద్ద కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో ఆయన చాలా కుంగిపోయారు. ఇవేమీ పట్టించుకోకుండా చిన్న కుమార్తె అడిగినవన్నీ చేశాడు ఆ తండ్రి. కానీ చిన్న కూతురు (16) సైతం పెద్ద కూతురు బాటలోనే నడవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. చిన్న కుమార్తె ఓ యుకుడ్ని ప్రేమించి అతడితో వెళ్లిపోయి తండ్రి పరువు తీసింది. పెద్దమ్మాయి లాగే చిన్న కుమార్తె సైతం తన పరువు తీస్తుందని అవమానంతో ఆమె దారుణంగా హతమార్చాడు.
తండ్రి సెల్ఫీ వీడియో వైరల్..
నా కూతుర్ని చంపేశానంటూ తండ్రి తీసిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. తన కూతురుకు నచ్చిన స్కూల్ లో చదివించినట్లు తెలిపారు. వేరే వాళ్లను ప్రేమించడానికి కుమార్తెను పెంచలేదని, ఆమె కాళ్లపై నిలబడేలా ఉండేందుకు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించినట్లు చెప్పారు. కానీ పెద్ద కూతురు చేసినట్లు చిన్న కూతురు తన పరువు తీస్తుందని హత్య చేసినట్లు తెలిపారు. విశాఖ వన్ టౌన్ పోలీసులు, ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని సెల్ఫీ వీడియోలో వరప్రసాద్ కోరారు. ఓ అబ్బాయిని తాను ప్రేమిస్తున్నానని, కూతురు తనకు చెప్పిందని.. అయితే ఇలాంటి గొడవలు వద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదన్నారు.
తల్లి చనిపోయిన రోజే కుమార్తెను హత్య..
కూతురు ప్రవర్తన నచ్చలేదని ఆమెను హత్య చేసినట్లు వర ప్రసాద్ తెలిపారు. తన తల్లి విజయలక్ష్మి చనిపోయిన రోజు అని, అదేరోజు చిన్న కూతుర్ని పిలిపించి హత్య చేసినట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. అయితే ఇతర కేసుల్లా ఈ కేసును భావించవద్దని, పోలీసులు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించాలని నిందితుడు కోరారు. ప్రవర్తన బాగాలేదని, మంచిగా ఉండాలని సూచించినా ఆమె తన తండ్రితో వాదించింది. పరువు తీస్తుందని భావించి చిన్న కుమార్తెను హత్య చేసినట్లు వివరించాడు.
ఓ వైపు కొన్నేళ్ల కిందట భార్య ఆయనను వదిలి వెళ్లిపోయింది. ప్రేమగా పెంచి వారి బాధ్యతలు చూసుకున్నప్పటికీ.. పెద్ద కూతురు ప్రేమించి పెళ్లిచేసుకుంది. తండ్రి వరప్రసాద్ ఇది జీర్ణించుకోలేకపోయాడు. చిన్న కుమార్తెనే ప్రాణంగా చూసుకుంటూ ఆమెకు నచ్చిన స్కూల్ లో చదివించడం, అడిగినవన్నీ సమకూర్చడం చేస్తున్నాడు. కొన్ని రోజుల కిందట చిన్న కుమార్తె స్థానికంగా ఉండే యువకుడిని ప్రేమించానంటూ అతడితో వెళ్లిపోయినట్లు సమాచారం. దీనిపై పోలీసుల వద్దకు వ్యవహారం వెళ్లగా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. యువకుడు అంత మంచివాడు కాదని, అతడిపై ఇదివరకే కేసులు నమోదయ్యాయని చెప్పినా కూతురు వినిపించుకోలేదు. పెద్ద కూతురులాగే తన పరువు తీస్తుందని అవమానం భరించలేనంటూ దారుణానికి పాల్పడ్డాడు. తన తల్లి చనిపోయిన రోజునే చిన్న కూతురును హత్య చేసినట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు.