Macron Xi Jinping Meet:


మేక్రాన్, జిన్‌పింగ్ భేటీ..


ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక విషయాలు ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు పలు అంతర్జాతీయ అంశాలూ మాట్లాడుకున్నారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చించారు. బీజింగ్‌లో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం కీలక ట్వీట్‌లు చేశారు మేక్రాన్.  ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పగలిగేది కేవలం చైనా మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనా ఏం చేయనుందోనని ఆసక్తిగా గమనిస్తున్నట్టు చెప్పారు. 


"ఉక్రెయిన్‌లో శాంతియుత వాతావరణం నెలకొల్పగలిగే సామర్థ్యం చైనాకు ఉంది. దీన్ని మేమూ అంగీకరిస్తున్నాం. ఇదే విషయమై మాట్లాడుకున్నాం. దీంతో పాటు జిన్‌పింగ్‌తో మా రెండు దేశాల వాణిజ్యంపైనా చర్చించాను. వ్యాపారం, వాతావరణం, ఆహార భద్రతపైనా అభిప్రాయాలు పంచుకున్నాం" 


- ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు 










ఉక్రెయిన్‌లో యుద్ధం ముగిసిపోయి శాంతిని నెలకొల్పేందుకు చైనాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు మేక్రాన్. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జిన్‌పింగ్ మాట్లాడాలని సూచించారు. అయితే...ఉక్రెయిన్‌పై చర్యల్ని చైనా నేరుగా ఖండించడం లేదు. ఈ విషయంలో న్యూట్రల్‌గా ఉండేందుకే మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో మేక్రాన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఉక్రెయిన్ ప్రజలకు మేలు చేసే ప్రతి అంశంలోనూ చైనా భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు మేక్రాన్. 


నాటో సీరియస్..


బెలారస్‌లో రష్యా అణ్వాయుధాలు మొహరిస్తామని పుతిన్ హెచ్చరికలు జారీ చేయడంపై NATO తీవ్రంగా స్పందించింది. రష్యాపై విమర్శలు చేసింది. ఇది "ప్రమాదకరమే కాదు. బాధ్యతా రాహిత్యం కూడా" అని మండి పడింది. 


"నాటో అన్ని గమనిస్తోంది. రష్యా వైఖరిలో ఏ మార్పూ కనిపించడం లేదు. మళ్లీ అణ్వాయుధాల ప్రస్తావన తీసుకొస్తోంది. ఇక ఏం చేయాలన్నది మేమే నిర్ణయించుకుంటాం. నాటో సభ్య దేశాలన్నీ తప్పనిసరిగా గట్టి బదులే ఇస్తాయి. రష్యా పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తోంది."


- నాటో ప్రతినిధి 


బెలారస్‌తో ఉక్రెయిన్‌తో పాటు నాటో సభ్య దేశాలైన పోలాండ్, లిథుయేనియా, లావిటా దేశాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై పట్టు సాధించాలంటే ఈ ప్రాంతమే సరైందని రష్యా భావిస్తోంది. అటు నాటోకు కూడా గట్టి హెచ్చరికలు ఇచ్చినట్టవుతుందని యోచిస్తోంది. అందుకే...అక్కడే అణ్వాయుధాలను ఉంచాలని పావులు కదుపుతోంది. అయితే...అమెరికా మాత్రం రష్యాకు అంత సీన్‌ లేదని తేల్చి చెబుతోంది. ఇవన్నీ బెదిరింపులేనని వెల్లడించింది. పుతిన్ అణ్వాయుధాలతో దాడి చేస్తారని అనుకోడం లేదని తెలిపింది. కేవలం కొద్ది రోజుల పాటు బెలారస్‌లో ఉంచేందుకు ఒప్పందం కుదిరి ఉండొచ్చని భావిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ తీవ్రంగా మండి పడుతోంది. రష్యా అనవసరంగా పరిస్థితులను సంక్లిష్టం చేస్తోందని విమర్శిస్తోంది. రష్యా ప్రజలే ఈ తరహా నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. కావాలనే ఇలా కవ్విస్తోందని చెప్పింది. 


Also Read: Hindu Temple Vandalised: కెనడాలో హిందూ ఆలయాలపై ఆగని దాడులు, గ్రాఫిటీతో అభ్యంతరకర రాతలు