Chhattisgarh CM Race:


సీఎంగా విష్ణు దియో సాయి 


ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడనుంది. మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయిని (Vishnu Deo Sai) సీఎంగా ప్రకటించినట్టు (Chhattisgarh CM) విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 54 మంది ఎమ్మెల్యేలతో భేటీ జరిగిన సమయంలోనే విష్ణు పేరుని ప్రకటించినట్టు తెలుస్తోంది. కుంకురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విష్ణు దియో సాయి..87 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌ బీజేపీకి ఒకప్పుడు చీఫ్‌గా పని చేశారు. గిరిజన వర్గానికి చెందిన వ్యక్తిని సీఎంగా చేయాలన్న ఆలోచన వస్తే కచ్చితంగా విష్ణునే ఎంపిక చేసుకోవాలని ముందు నుంచీ హైకమాండ్ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆయన పేరునే కన్‌ఫమ్ చేసినట్టు సమాచారం. అధికారికంగా దీనిపై ఓ ప్రకటన రావాల్సి ఉంది. తన పొలిటికల్ జర్నీలో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టిన విష్ణు..మోదీ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2020 నుంచి 2022 వరకూ ఛత్తీస్‌గఢ్ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 


 






ట్రైబల్ లీడర్‌ని ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ మొదటి నుంచి సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఆ వర్గం నుంచే వచ్చిన నేతను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నది పార్టీ ఆలోచన. 59 ఏళ్ల విష్ణుదేవ్‌సాయి RSS నుంచి వచ్చిన వ్యక్తే. మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌కి అత్యంత సన్నిహితుడు కూడా. వివాదాలు లేని నేతగా హైకమాండ్‌ దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నారు. బీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగానూ ఉన్నారు.



"నన్ను ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాపైన నమ్మకం ఉంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, జేపీ నడ్డాకి ధన్యవాదాలు"


- విష్ణుదేవ్ సాయి, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి


విష్ణుదేవ్ సాయి సీఎం అవడంపై మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ స్పందించారు. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. విష్ణుదేవ్‌ సాయికి అభినందనలు తెలిపారు.