Chhattisgarh CM Race: 


ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరో..? 


ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు దాటినా ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు హైకమాండ్. అందుకు కారణం..ఈ పోస్ట్‌ విపరీతమైన పోటీ ఉండడమే. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్‌ని కాదని వేరే వాళ్లకు ఈ పదవి ఇస్తున్నారన్న ఊహాగానాలు ఇప్పటికే మొదలయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన ట్విటర్‌లో "అందరికీ రామ్ రామ్" అని పోస్ట్ పెట్టారు. ఇది ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఇక రాజస్థాన్ విషయమూ ఇంకా తేలలేదు. అయితే...ఛత్తీస్‌గఢ్ విషయంలో మాత్రం త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైకమాండ్ నియమించిన పరిశీలకులు ఛత్తీస్‌గఢ్‌కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఎవరో వీళ్లే ఫైనల్ చేయనున్నారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. నిజానికి హైకమాండ్‌ వరుస సమావేశాలతో బిజీగా ఉంది. మొత్తం మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల్ని ప్రకటించడంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కీలక నేతలంతా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పటికీ పలువురు నేతలు నడ్డా ఇంటికి తరలి వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేలతోనూ కీలక సమావేశం జరగనుంది. ఆ తరవాత సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెర దించనుంది బీజేపీ. 


"పార్టీ అబ్జర్వర్‌లు వచ్చారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. సీఎంగా ఎవరిని నియమించాలో అన్న ఫార్ములా ఏమీ లేదు. బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ నిర్ణయం ప్రకారమే ఇదంతా జరుగుతుంది"


- బీజేపీ నేతలు


రమణ్‌ సింగ్‌ని కాదంటే..?


ఛత్తీస్‌గఢ్‌లో మొన్నటి వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. మొత్తం 90 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 54 చోట్ల విజయం సాధించింది బీజేపీ. కాంగ్రెస్ 35 స్థానాలకే పరిమితమైంది. రమణ్‌ సింగ్ సీఎం రేసులో ఉన్నప్పటికీ ఆయనను కాదంటే OBC నేతకు ఆ అవకాశమిస్తారని తెలుస్తోంది. 2003-18 వరకూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు రమణ్ సింగ్. అందుకే ఈసారి కొత్త వాళ్లకి అవకాశమివ్వాలని చూస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలున్న నేపథ్యంలో కీలకమైన వ్యక్తికే ఈ పదవినివ్వాలని భావిస్తోంది హైకమాండ్. 


మధ్యప్రదేశ్‌కి ఇప్పటి వరకూ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే..ఈ సారి ఆయనకు పోటీగా పలువురు కేంద్రమంత్రులు ఈ రేస్‌లో ఉన్నారు. ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటు కైలాశ్ విజయ్‌వర్గియ కూడా పోటీ పడుతున్నారు. ఇక రాజస్థాన్‌లోనూ ముఖ్యమంత్రి రేస్‌లో చాలా మందే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్‌ బీజేపీ ప్రెసిడెంట్ సీపీ జోషి, దియా కుమారి, మహంత్ బాలాకాంత్ రేసులో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ సావో, ప్రతిపక్ష నేత ధరమలాల్ కౌశిక్, మాజీ IAS అధికారి ఓపీ చౌదరి కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. 


Also Read: Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా